బొమ్మలరామారం : మండలంలోని తూంకుంట గ్రామ ఉప సర్పంచ్ మేకల బాలకృష్ణ(36) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ శుక్రవారం రాత్రి స్వగ్రామం నుంచి తన ద్విచక్రవాహనంపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో అంకిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బాలకృష్ణ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణను స్థానికులు 108 వాహనంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.
బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్
ఫ గ్రామ పంచాయతీ ఆఫీసర్ మృతి
చివ్వెంల(సూర్యాపేట) : బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో గ్రామ పంచాయతీ ఆఫీసర్(జీపీఓ) మృతిచెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన షేక్ ముస్తఫా(58) తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ పంచాయతీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకుని బైక్‌పై కోదాడకు వస్తుండగా.. మార్గమధ్యలో చివ్వెంల మండల వల్లభాపురం గ్రామ శివారులో ఎదురుగా రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముస్తఫా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ హఫీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వి. మహేశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
ఉరేసుకుని ఆత్మహత్య
పెన్‌పహాడ్ : షాపు యాజమానుల వేధింపులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన షేక్ హుస్సేన్(35) హైదరాబాద్‌లో శ్రీనివాస సిమెంట్, ఐరన్ షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో షాపు యాజమాని సుందరి కోటేశ్వర్‌రావు, హాజీ పటేల్ వేధింపులకు గురిచేస్తున్నారని షేక్ హుస్సేన్ పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పాడు. కాగా శుక్రవారం ఉదయం షేక్ హుస్సేన్ హైదరాబాద్ వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరి అనంతారం క్రాస్ రోడ్డు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు షేక్ లతీఫ్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


