ఫ పాత బావిలోని బురదలో
కూరుకుపోయి ఆవు మృతి
శాలిగౌరారం : దాహార్తి తీర్చుకునేందుకు పాత బావిలోకి వెళ్లిన ఆవు బురదలో కూరుకుపోయి మృతిచెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఊట్కూరు గ్రామానికి చెందిన కప్పల యాదయ్య నాలుగు రోజుల క్రితం తన పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లాడు. అందులో ఓ ఆవు దాహార్తి తీర్చుకునేందుకు సమీపంలో పూడికతో నిండిన పాత బావిలోకి వెళ్లింది. బావిలోని ఒండ్రు మట్టిలో ఆవు కూరుకుపోయి బయటకు రాలేక మృతిచెందింది. ఆవును గమనించని యజమాని అదే తిరిగి వస్తుందనుకుని ఇంటికి వెళ్లాడు. నాలుగు రోజులు గడిచినా ఆవు ఇంటికి రాకపోవడంతో గ్రామ సమీపంలో పూడికతో నిండిన బావి వద్దకు వెళ్లి చూడగా అందులో ఆవు మృతిచెంది ఉంది. కాగా.. ఆవు కళేబరం వద్దకు వచ్చిన లేగ దూడ బావి చుట్టూ అరుస్తూ తిరుగడం గ్రామస్తులను కలిచివేసింది.
వినూత్నంగా అవగాహన
కేతేపల్లి : మండలంలోని బీమారం గ్రామంలో శనివారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కోయ దొర వేషధారణలో కరపత్రాలు పంచుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతిఒక్కరు పాటించాలని ఆయన సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో వావనాలు నడపరాదని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తాజుద్దీన్, నర్సయ్యచారి, నాగరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


