భూదాన్‌పోచంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములకు రక్షణ కల్పిస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం వినోబాభావే సేవా సమితి ఆధ్వర్యంలో పోచంపల్లిలో నిర్వహించిన భూదానోద్యమ వజ్రోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట పేదల భూములను భూస్వాములకు అప్పగించే కుట్ర చేసిందన్నారు. భూదాన యజ్ఞబోర్డును పునరుద్ధరించి రాష్ట్రంలో మిగిలిపోయిన భూదాన భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని అన్నారు. అనంతరం భూమి సునీల్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను అధ్యయనం చేశామని తెలిపారు. ఒక వ్యవస్థను రూపొందించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ తడక యాదగిరి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


