యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రంలో ఆదివారం ఉదయం సుదర్శన నారసింహస్వామి విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్, యాదగిరిగుట్ట మున్నూరు కాపు సంఘం చైర్మన్ నేతి విద్యాసాగర్ తెలిపారు. ఈ విశ్వశాంతి యజ్ఞంలో 108 జంటలు పాల్గొంటాయన్నారు. అంతేకాకుండా 1008 మంది దంపతులతో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం సైతం జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సుదర్శన నారసింహ హోమంతో పాటు స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకలో సుమారు 5వేల మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం కొనసాగుతాయన్నారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ట్రస్టు సభ్యులు పలుగుల శ్రీనివాస్, జీఎంఏ కన్వీనర్ రజనీకాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, అవుల సురేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


