యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులు నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలు విశేషంగా జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
చెరువుకట్ట పరిశీలన
మోత్కూరు : మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు ఇటీవల వర్షా కాలంలో 20 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతుతో పెద్దఎత్తున కుంగిపోయింది. శుక్రవారం నీటి పారుదల శాఖ సూర్యాపేట చీఫ్ ఇంజనీర్ టీఎన్ భూషణ్‌రావు, తిరుమలగిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ సందర్శించి పరిశీలించారు. చెరువు కట్ట రోడ్డు ప్రాధాన్యతను పరిశీలించి అన్ని రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరుకాగానే మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట ఏఈలు చంద్రశేఖర్, అఖిల్ ఉన్నారు.
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూరు(ఎం) : ఉచిత వైద్యశిబిరాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. చేనేత జౌళి శాఖ, జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో చేనేత కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైధ్యాధికారి సుమన్ కల్యాణ్, చేనేత మరియు జౌళి శాఖ ప్రాంతీయ అధికారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, వైద్యాధికారి అమరావతి, చేనేత సంఘం మేనేజర్ వేముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయాలి
గుండాల : ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదరరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశాన్ని గుర్రం మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్న తూకాలు ప్రారంభించడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మంచి నీరు, నీడ, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమని హరిశ్చంద్ర, దయాకర్‌రెడ్డి, కొమురయ్య, జోసఫ్, యాదయ్య, స్వామి, భిక్షం పాల్గొన్నారు.


