చౌటుప్పల్ : రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్‌రావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు– నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు, సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, ప్రాణ, ఆస్తినష్టం లేకుండా వ్యవహరించాల్సిన తీరును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు అధికంగా ఉన్నందున ఆయా పరిశ్రల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీతోపాటు ప్రమాద సమయంలో స్పందించాల్సిన అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో దివీస్ పరిశ్రమ జనరల్ మేనేజర్లు బాలకిషోర్, పెండ్యాల సుధాకర్, ఏజీఎం సాంబశివరావు, మండల ఫైర్ అధికారి శివాజీ, దివీస్ ప్రతినిధులు ఉమామహేష్, రంగారావు, ఎన్‌వీడీ ప్రసాద్ పాల్గొన్నారు.


