భూ సంస్కరణలకు నాంది | - | Sakshi
Sakshi News home page

భూ సంస్కరణలకు నాంది

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

75 ఏళ్ల కిందట బీజం విద్యాసంస్థలు, ఇళ్లకు భూమి దానం భూదాన భూములకు చట్టబద్ధత

80 ఎకరాలు రాసిచ్చిండు

భూదాన్‌పోచంపల్లి : 50వ దశకంలో పోచంపల్లిలో 500 కుటుంబాలు నివసించేవి. వీరిలో చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అప్పటి మద్రాస్‌, ఆంధ్రా, తెలంగాణలో కమ్యూనిస్టుల మద్దతుతో భూమిలేని ప్రజలంతా భూస్వాములపై తిరుగుబాటు మొదలుపెట్టారు.

ఆ సమయంలోనే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కారం కనుగొనడానికి గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే 1951 ఏప్రిల్‌ 17న పాదయాత్రగా పోచంపల్లికి వచ్చారు. మరుసటి రోజు ఏప్రిల్‌ 18న స్థానిక చెరువు సమీపంలో ఉన్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు తలా రెండెకరాల భూమి ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని 40 దళిత కుటుంబాలు తమ గోడు వెల్లబోసుకున్నారు. గ్రామంలోని భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డికి వేల ఎకరాల భూమి ఉందని, మీరు అడిగితే కాదనరని దళితులు వినోబాభావేకు చెప్పారు. దీంతో వెదిరె రామచంద్రారెడ్డిని అడిగిందే తడవుగా తన తండ్రి వెదిరె నర్సింహారెడ్డి జ్ఞాపకార్ధం 100 ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించారు. అక్కడికక్కడే వెదిరె రామచంద్రారెడ్డి దాన పత్రాన్ని రాసి వినోబాభావేకు అందించారు. ఆ భూమిని దళితులకు పంచి వినోబాభావే భూదానోద్యామానికి శ్రీకారం చుట్టారు. 100 ఎకరాలతో మొదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి ఐదేళ్లలో 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టారు. ఈ భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్థిక అసమానతలు తొలగడానికి దోహదపడింది. ఇలా పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆచార్య వినోబాభావే పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా పేర్కొనడం విశేషం.

కాగా వెదిరె రామచంద్రారెడ్డిని అప్పటి పోచంపల్లి ప్రజలంతా భాయ్‌సాబ్‌ అని పిలిచేవారు. అతడు మొదట దళితులకు 100 ఎకరాల వ్యవసాయ భూమిని దానం చేయగా.. అనంతరం విడతల వారీగా మొత్తం 800 ఎకరాల వరకు భూమిని దానం చేశారు. ఆయన దానం చేసిన 14 ఎకరాలలోనే ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శాఖ గ్రంథాలయం, అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించారు. అంతేకాక 24 ఎకరాలలో లక్ష్మణ్‌నగర్‌ కాలనీ, మరో రెండెకరాలలో ఇందిరానగర్‌ కాలనీలు ఏర్పాటయ్యాయి.

వినోబాభావే దేశవ్యాప్తంగా తిరిగి సేకరించిన భూదాన్‌ భూములకు చట్టబద్ధత కల్పించాలని 1958లో అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ అధ్యక్షతన దేశంలోని మేధావులతో సమావేశం నిర్వహించి ‘భూదాన్‌–గ్రామదాన్‌’ చట్టాన్ని రూపొందించడానికి కమిటీని వేశారు. అనంతరం 1965లో అధికారికంగా భూదాన్‌–గ్రామదాన్‌ చట్టానికి చట్టబద్దత లభించింది. అనంతరం మిగిలిన భూదాన్‌ భూములను నిరుపేదలకు పారదర్శకంగా పంపిణీ చేయడానికి ఆయా రాష్ట్రాలలో భూదాన యజ్ఞబోర్డులను ఏర్పాటు చేశారు.

దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూదానోద్యమం

మొదలైంది ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని

పోచంపల్లి నుంచే. అందుకే దీనిని భూదాన్‌పోచంపల్లి

అని పిలుస్తుంటారు. ఈ భూదానోద్యమంతో పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు లభించాయి. భూదానోద్యమం మొదలై నేటికి 75 ఏళ్లు పూర్తయిన

సందర్భంగా ప్రత్యేక కథనం.

ఫ 75 ఏళ్ల క్రితం పోచంపల్లిలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన ఆచార్య వినోబాభావే

ఫ 100 ఎకరాలు దానం చేసిన స్థానిక

భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి

ఫ నేడు పోచంపల్లిలో

భూదానోద్యమ వజ్రోత్సవాలు

నాడు భాయ్‌సాబ్‌(వెదిరె రామ చంద్రారెడ్డి) పోచంపల్లిలో ఉన్న మా దళితులకు 80 ఎకరాల భూమి దానం చేసిండు. 2 ఎకరాల చొప్పున 40 కుటుంబాలు వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. భాయ్‌సాబ్‌ మాపాలిట దేవుడు. ఆయనను ఊపిరి ఉన్నంత వరకు మరువం.

– కరగళ్ల నర్సింహ, ప్రథమ భూగ్రహీత కుమారుడు

Advertisement
 
Advertisement
Advertisement