భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడంలేదని.. | - | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడంలేదని..

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

రామగిరి(నల్లగొండ) : భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకుల కొండారం గ్రామానికి చెందిన చెనగోని రాకేష్‌కు(25) మూడేళ్ల క్రితం నల్లగొండ పట్టణానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప సంతానం. గత నెల పుట్టింటికి వెళ్లిన మమత తిరిగి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్‌ శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి మదార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నల్లగొండ రూరల్‌ ఏఎస్‌ఐ లాజర్‌ తెలిపారు.

ఉరేసుకుని ఇంటర్‌

విద్యార్థిని ఆత్మహత్య

కోదాడరూరల్‌ : పరీక్షలో ఫెయిలైన ఇంటర్‌ విద్యార్థిని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలలో శుక్రవారం జరిగింది. వివరాలు.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన బొగ్గారపు లేక్ష్యా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ కాగా.. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి కళాశాలకు వచ్చింది. వచ్చిన గంట సేపటికే మొదటి అంతస్తులోని క్లాస్‌రూంకు వెళ్లి ఉరేసుకుంది. కళాశాల పక్క ఇంటి వారు గమనించి సిబ్బందికి చెప్పడంతో వారు వెళ్లి విద్యార్థినిని కిందకు దించి స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ సీఐ కె. శివశంకర్‌ తెలిపారు.

కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

మర్రిగూడ(చింతపల్లి) : లారీ కారును ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్‌ శివారులో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ టౌన్‌కు చెందిన సూర్య గిరిధర్‌గౌడ్‌(28) బిజినెస్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన స్నేహితుడు అవినాష్‌తో కలిసి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్‌ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్‌ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గిరిధర్‌గౌడ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి స్నేహితుడు అవినాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి సోదరుడు సూర్య అరవింద్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ మృతి

త్రిపురారం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన బైరం పెదభిక్షం, లక్ష్మమ్మ భార్యాభర్తలు. వీరి వద్దే పెదభిక్షం చెల్లెలి కుమారుడు పగడాల ప్రకాష్‌ ఉంటున్నాడు. పెదభిక్షంకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ముగ్గురు కలిసి గురువారం మిర్యాలగూడలో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బైక్‌పై తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయడ్డారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పెదభిక్షం శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement