వెట్టిచాకిరి నుంచి చిన్నారికి విముక్తి | - | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరి నుంచి చిన్నారికి విముక్తి

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

అనంతగిరి(కోదాడ) : వెట్టిచాకిరి నుంచి ఏడేళ్ల బాలికకు విముక్తి కల్పించారు ఐసీడీఎస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది. అనంతగిరి మండలం పాలవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో ఏడేళ్ల వయసున్న సుబ్బులు అనే బాలిక ఎండలో బాతులు మేపుతుండగా అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గమనించి చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది చిన్నారి వద్దకు చేరుకుని అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. తన తల్లిదండ్రుల పేర్లు సుబ్బయ్య, లక్ష్మి అని తెలిపింది. నాలుగేళ్ల క్రితం కోదాడ పట్టణంలోని చందానగర్‌కు చెందిన పాలకుర్తి శ్రీకాంత్‌ అనే వ్యక్తి వద్ద తనను వదిలి వెళ్లిపోయారని చెప్పింది. అప్పటి నుంచి శ్రీకాంత్‌ తనతో ఇంటి పనులు చేయించడం, బాతులు మేపించడం, తరచూ కొట్టడం, తిట్టడం చేస్తున్నాడని బాలిక ఏడుస్తూ పోలీసులకు వివరించింది. ఈ మేరకు పాలకుర్తి శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ లింగారెడ్డి తెలిపారు. అనంతరం చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ సభ్యులు బాలికను సూర్యాపేట పట్టణంలోని బాల రక్షక భవన్‌కు తరలించారు.

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌...

యజమాని కొట్టిన గాయాలను పోలీసులకు చూపిస్తూ చిన్నారి ఏడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా తనను చదివిస్తే చదువుకుంటానని ఆ చిన్నారి పోలీసులకు చెప్పింది.

ఫ బాల రక్షక భవన్‌కు

తరలించిన అధికారులు

ఫ యజమానిపై కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement