కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత కాంట్రాక్ట్‌కు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల కోసం కాంట్రాక్టర్ సమర్పించిన చలానాలు నకిలీగా తేలాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంత కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న నార్కట్‌పల్లి వాసి దూదిమెట్ల శ్రీనివాస్ రూ.1.22కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అలాగే 2024–25 సంవత్సరానికి గాను రూ.20లక్షలు, 2025–2026 సంవత్సరానికి గాను రూ.40 లక్షలు చెల్లించలేదు. ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలని సదరు కాంట్రాక్టర్‌పై పాలకవర్గం ఒత్తిడి తెచ్చింది. దీంతో సదరు గుత్తేదారు మొత్తం రూ.60లక్షలకు మార్చిలో పలుమార్లు దేవరకొండ ఎస్‌బీఐ బ్రాంచ్‌కి చెందిన ఆరు చలాన్లు సమర్పించాడు. అయితే ఈ ఆరు చలానాలు నకిలీగా అనుమానం రావడంతో పాలకవర్గం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ చాలానా అంశంపై విచారణ చేయాలని డీపీఓ ద్వారా ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సుధీర్‌కుమార్‌ను ఆదేశించారు. అయితే సదరు ఇన్‌చార్జ్ ఎంపీడీఓ విచారణ లేకుండానే నివేదిక పంపించడం గమనార్హం.
ఇటీవల పాలకవర్గం బ్యాంకును సంప్రదించగా ఇవి నకిలీ చలానాలుగా అధికారులు తేల్చారు. ఈ విషయమై ఇన్‌చార్జ్ డీపీఓ శంకర్‌నాయక్‌ను వివరణ కోరగా నకిలీ చలానాల విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫ రూ.60లక్షల బకాయిలకు నకిలీ చలానాలు సమర్పించిన కాంట్రాక్టర్


