లారీ ఢీకొని మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ దుర్మరణం

Apr 17 2026 10:20 AM | Updated on Apr 17 2026 10:20 AM

చౌటుప్పల్‌ : పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళను లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. చౌటుప్పల్‌లోని వలిగొండ క్రాస్‌ రోడ్డు వద్ద హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబీకురాలైన కడారి యాదమ్మ (50) రోజువారీ కూలి పనికి వెళ్తుంది. భర్త మల్లయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉండే ఈడెం మల్లేష్‌తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఫంక్షన్‌లో వంట వండేందుకు వెళ్లారు. సాయంత్రం పని ముగిసిన తర్వాత ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో వలిగొండ రోడ్డు నుంచి జాతీయ రహదారి క్రాస్‌ చేస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న యాదమ్మ ఎగిరి కింద పడింది. లారీ టైర్లు ఆమైపె నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. బైక్‌ నడుపుతున్న మల్లేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. యాదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement