భయం వీడండి.. ప్రాణం నిలపండి | - | Sakshi
Sakshi News home page

భయం వీడండి.. ప్రాణం నిలపండి

Apr 17 2026 10:20 AM | Updated on Apr 17 2026 10:20 AM

రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం రాహత్‌’ వరం

భువనగిరిటౌన్‌ : రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఓడుతున్న బాధితులను చూసి అయ్యో అనుకుంటూ వెళ్లిపోతుంటారు. పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతుంది. ఈ భయాలను పో గొట్టి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘రహ– వీర్‌’ అనే పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 18 వరకు జరుగుతున్న ‘అరైవ్‌ అలైవ్‌’ వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

గోల్డెన్‌ అవర్‌.. ప్రాణం నిలిపే సమయం

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడవచ్చు. ఈ కీలక సమయంలో బాధితులను ఆస్పత్రికి చేర్చే సామాన్య పౌరులే నిజమైన హీరోలు. వారినే ప్రభుత్వం రహ– వీర్‌గా గౌరవిస్తోంది. ఇందులో భాగంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి చేర్చి కాపాడిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం రూ. 25వేల నగదు బహుమతిని అందజేస్తోంది. అంతేకాకుండా సామాజిక బాధ్యతను గుర్తిస్తూ రవాణా శాఖ అధికారికంగా ప్రశంసా పత్రాన్ని ఇస్తుంది. గుడ్‌ సమారిటన్‌ చట్టం ప్రకారం సాయం చేసే వారికి పూర్తి రక్షణ ఉంటుంది. అనుమతి లేకుండా పోలీసులు వ్యక్తిగత వివరాలు అడగరు. సాక్ష్యం కోసం బలవంతం చేయరు. కోర్టులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు

బాధితులను ఆస్పత్రులకు తీసుకువచ్చినప్పుడు వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించాలి. డబ్బుల కోసం జాప్యం చేసినా లేదా సాయం చేసిన వారిని ఇబ్బంది పెట్టినా ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా వైద్య అధికారులను ఆదేశించింది.

నిబంధనలు ఇవే..

ఫ ప్రమాద సమయంలో సాయం చేసిన వ్యక్తి వివరాలను సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారి, ఆస్పత్రి యాజమాన్యం నమోదు చేస్తుంది.

ఫ కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ ఈ వివరాలను పరిశీలించి, అర్హులను రహ–వీర్‌గా ఎంపిక చేస్తుంది.

ఫ ఎంపికై న వారి ఖాతాలో నేరుగా నగదు జమ చేయబడుతుంది.

ఫ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రిలో చేర్పిస్తే రూ. 25వేల నగదు బహుమతి

ఫ రహ– వీర్‌ పథకాన్ని అమలు చేస్తున్న

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఫ ‘అరైవ్‌ అలైవ్‌’ వారోత్సవాల్లో భాగంగా

అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ

రోడ్డు ప్రమాద బాధితులకు సరైన వైద్యసేవలు అందకపోవడంతో 50 శాతం మరణాలు సంభవిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి బాధితులకు వైద్య ఖర్చులు అందించేందుకు ఫిబ్రవరిలో పీఎం రాహత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.50లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మొదటి 7 రోజుల వరకు అయ్యే అత్యవసర చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం బాధితులు ముందస్తుగా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు లేదా సహాయం చేసే వ్యక్తులు 112 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఈ నంబర్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్‌న్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌కు లింక్‌ చేయడం వల్ల, బాధితులకు తక్షణమే అంబులెన్స్‌ సాయంతోపాటు, సమీపంలోని ఆస్పత్రి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement