ఇందిరమ్మ ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం

Apr 17 2026 10:20 AM | Updated on Apr 17 2026 10:20 AM

మునగాల: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన గురువారం మునగాల మండలంలోని తాడువాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోట సునీతకు 2008లో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉంది. కానీ వాస్తవానికి తన మంజూరు కాలేదని, ఇందిరమ్మ ఇళ్ల ఇల్లు మంజూరు చేయాలని గత కొంత కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. పలుమార్లు కలెక్టర్‌కు ప్రజావాణిలో మొర పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌, ఎస్పీ నరసింహ, తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. దీంతో సునీత తన పేరు కల్గిన మరో మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తనకు కాలేదని చెప్పినప్పటీకీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుమందు డబ్బాను తీసి తాగేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న కొందరు అడ్డుకున్నారు. మునగాల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి సిబ్బందిసాయంతో సదరు మహిళ చేతిలో నుంచి పురుగుమందు డబ్బాను తీసేసి హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం సునీత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. తనకు న్యాయం చేయాలని, తన పేరు మీద వేరే వ్యక్తులకు ఇల్లు మంజూరు చేసిన అఽధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సునీత కోరడంతో కలెక్టర్‌ స్పందించి ఈ విషయమై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement