కొండమల్లేపల్లి : విద్యుత్ శాఖకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లు క్లియరెన్స్ ఇచ్చేందుకు ఏడీఈ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా గురువారం నల్లగొండ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ విద్యుత్ శాఖలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న సిరికొండ సైదులు ఓ కాంట్రాక్టర్ చేసిన పనులకుగాను రూ.10లక్షల బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్ నల్లగొండ ఏసీబీ పోలీసులను వారం క్రితం ఆశ్రయించాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గురువారం దేవరకొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ నుంచి ఏడీఈ రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పర్చి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కాగా.. హైదరాబాద్‌లోని ఏడీఈ సైదులు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా
పట్టుకున్న అధికారులు
ఫ వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ
జగదీశ్‌చందర్


