భువనగిరిటౌన్ : డ్రైవర్లు ప్రతి ఆరునెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భువనగిరి బస్టాండ్ ఆవరణలో ఆటో, స్కూల్ బస్సులు, భారీ వాహన డ్రైవర్లకు చావా ఫౌండేషన్, పర్ఫెక్ట్ ఐ విజన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులతో కలిసి ఎస్పీ హాజరై మాట్లాడారు. కంటి చూపు సరిగ్గా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి సాయికృష్ణ, డీఎస్పీలు బి. రవీందర్, ప్రభాకర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ఎం. రమేష్, మధు సూదన్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ @ 43 డిగ్రీలు
చౌటుప్పల్ : ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం చౌటుప్పల్‌లో ఏకంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 7గంటల నుంచే ఎండ తీవ్రత మొదలయ్యింది. అలా గంట గంటకు పెరుగుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక్కసారిగా 41డిగ్రీలకు చేరింది. 3.30గంటలకు ఏకంగా 43డిగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అల్లాడిపోయారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే చిన్నకొండూర్‌రోడ్డు, తంగడపల్లిరోడ్డు, వలిగొండరోడ్డు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వేసవి తాపాన్ని తాళలేక జనం మంచినీళ్లు, శీతల పానీయాలు సేవించడానికి ఎగబడ్డారు.


