వన్యప్రాణులకు జలరక్షణ | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులకు జలరక్షణ

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

సాసర్‌పిట్‌లను నింపుతున్నాం

250 ఎకరాల్లో అర్బన్‌ పార్కు

నాగార్జునసాగర్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భాగమైన నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌జోన్‌ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఓ పక్క అడవుల విస్తీర్ణం పెంచుతూ మరోపక్క వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సున్నిపెంట వరకు 2,166 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవి విస్తరించి ఉంది. సాగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో మూడు రేంజ్‌లు, 40 మేరకు బీట్లు ఉన్నాయి. నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లో 76,350 ఎకరాలు, దేవరకొండ ఫారెస్ట్‌ రేంజ్‌లో 9,945 ఎకరాలు, కంబాలపల్లి రేంజ్‌లో 28,000 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. వేసవి సమీపించడంతో వాగులు, వంపులు, నీటి జాలు గుంతల్లో నిల్వగా ఉన్న వర్షపు నీటి నిల్వలు ఇంకిపోవడంతో వన్యప్రాణులకు నీరు దొరకక మైదానం ప్రాంతంలోకి వస్తూ రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో జంతువుల దాహార్తి తీర్చేందుకుగాను అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సుమారుగా 120 వరకు ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లను శుభ్రం చేసి అందులో నీటిని పోస్తున్నారు. కొన్ని చోట్ల బోర్లు ఉండగా విద్యుత్‌ సౌకర్యం ఉన్న చోట పైపులైన్లు వేశారు. మరికొన్ని చోట్ల సోలార్‌ విద్యుత్‌ సౌకర్యంతో బోర్లకు మోటార్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా సాసర్‌పిట్స్‌లో నీటిని నింపుతున్నారు. బోర్లకు సమీపంలో ఉన్న నీటికయ్యలు, వంపులు, చెక్‌డ్యాంలను నింపుతున్నారు. క్షేత్ర స్థాయిలో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు సాసర్‌ఫిట్స్‌ వద్ద, మరికొన్ని దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జంతువుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జంతుగణనకు కూడా ఇది తోడ్పడే అవకాశం ఉంది.

జంతువుల దాహార్తి తీర్చేందుకు

ట్యాంకర్ల సాయంతో సాసర్‌పిట్లను

నింపుతున్న అధికారులు

విద్యుత్‌ సౌకర్యం ఉన్న చోట

పైపులైన్ల ద్వారా సరఫరా

వన్యప్రాణుల సంచారాన్ని

గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు

వేసవిలో అడవి జంతువుల సంరక్షణకు నీటికయ్యలు, చెక్‌డ్యాంలు, వంపుల్లోకి నీటి ని పారిస్తున్నాం. ట్యాంకర్ల సాయంతో సాసర్‌ పిట్‌లను నింపుతున్నాం. అగ్నిప్రమాదాలు జరగకుండా చెట్లను నరకకుండా, జంతువులను వధించకుండా అటవీ శివారు గ్రామాల్లో బేస్‌ క్యాంప్‌ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. స్వచ్ఛంద సంస్థలు సైతం అడవుల రక్షణ బాధ్యత తీసుకోవాలి.

– రమేష్‌, సెక్షన్‌ ఆఫీసర్‌

నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌–హాలియా, నల్లగొండకు వెళ్లే రహదారి వెంట మూడు రోడ్ల కూడలి (సమ్మక్క సారక్కల) సమీపంలో రూ.1.5 కోట్ల వ్యయంతో 250 ఎకరాల్లో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో దారులు ఏర్పాటు చేసి పట్టణాల నుంచి వచ్చే పర్యాటకులను ఫారెస్ట్‌ శాఖ వాహనాల్లో అడవిలోకి తీసుకువెళ్లి చూపించి తిరిగి తీసుకువస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement