గుర్రంపోడు : బత్తాయికి వచ్చే మంగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో సాగవుతున్న బత్తాయి తోటల్లో ఎంతో కొంత మంగు ఆశించని తోట అంటూ లేదంటే సమస్య తీవ్రత ఏస్థాయిలో ఉందో చెప్పవచ్చు. కాయలపై వక్క లేదా ఊదా రంగు లేదా ముదురు గోధుమరంగు ఏర్పడటాన్ని మంగు అంటారు. ప్రస్తుతం కత్తెర బత్తాయి కాయలు మంచి సైజును సంతరించుకునే దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఎండలు ముదిరే మార్చి, ఏప్రిల్‌లో మంగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో బత్తాయిలో మంగును నివారించి విలువైన కత్తెర బత్తాయి పంటను కాపాడుకోవడానికి అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి మురళి పలు సూచనలు చేశారు.
నల్లి పురుగులతో మంగు
బత్తాయి కాయలపై మంగు ఏర్పడటానికి ప్రధాన కారణం మంగునల్లి. ఈ నల్లులు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వీటి పిల్లలు పసుపు రంగులోనూ, పెద్ద నల్లులు ఆరంజి రంగులోనూ ఉంటాయి. పిల్ల, పెద్ద మంగు నల్లులు పిందెలపైన, కాయలపైన పారాడుతూ బత్తాయి కాయల తొక్కల నుంచి రసం పీల్చుతాయి. రసాన్ని పీల్చే పక్రియలో నల్లి నోటి నుంచి రసాయనాన్ని వదులుతుంది. ఈ రసాయనం కాయతోలు నుంచి స్రవించిన ద్రవం, సూర్యరశ్మి మార్పు చెంది తుప్పురంగుగా మారుతుంది. బత్తాయి పిందెలకు నల్లి ఆశిస్తే కాయ సైజు తగ్గదు కానీ మంగు వచ్చి తోలు గట్టిపడి పెలుసుగా మారుతుంది. కాయ రుచిలో తేడా రాదు. ఐనా మంగు కాయలకు తోలు గట్టిపడి పెలుసుగా మారి చూడటానికి నల్లగా కనిపిస్తున్నందున మార్కెట్‌లో ధర పలకదు.
మంగు నల్లి నివారణ
● రైతులు భూతద్దం సహాయంతో నల్లి ఉనికిపై నిఘా ఉంచాలి. ఒకటి, రెండు నల్లులు తోటలో ఎక్కడైనా పిందెలు, కాయలపై కనిపించగానే స్ప్రేయింగ్ మొదలు పెట్టాలి. సెల్‌ఫోన్‌పై కూడా కొమ్మను ఊపితే స్క్రీపై సన్నగా పాకుతూ కనిపించే మంగు నల్లి పురుగులు గమనించవచ్చు. రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టాలి.
● చెట్లలో కొమ్మల కత్తిరింపులు సకాలంలో సక్రమంగా చేసి చెట్టు లోపల గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి.
● తోటల్లో ఎండు పుల్ల కత్తిరించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలి. ఈ రాగి ధాతువు శిలీంద్రనాశిని కత్తిరించిన కొమ్మలకు రక్షణ ఇవ్వడమేగాక నల్లికి ప్రతి కూలంగా ఉంటుంది.
● మంగునల్లి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల ప్రాపర్‌గైట్ లేదా ఒక గ్రాము డైపెంధిరాన్ లేదా రెండు మిల్లీ లీటర్ల ఇధియాన్ వంతున కలిపి మందు మార్చుతూ అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి చొప్పున రెండు, మూడు సార్లు పిందెలన్నీ తడిసేలా పిచికారీ చేయాలి.
● మంగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే స్పైరో మిసిఫిన్ ఒక మిల్లీ లీటరు వేప నూనె మూడు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
● పిందెలు గోళీకాయ సైజు నుంచి నిమ్మ కాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల సల్పేట్ ఆఫ్ పోటాష్ మరియు 5 గ్రాముల మల్టీకే ఒక మారు పిచికారీ చేస్తే నల్లిని అణిచివేయడంతోపాటు కాయసైజు నాణ్యత పెరగుతుంది.
● నీటి తడులు ఎక్కువ కాకుండా అవసరం మేరకు డ్రిప్ పద్ధతిలో అందించాలి. సిఫారసు మేరకు సమతుల సమగ్ర ఎరువులు సకాలంలో అందించాలి. మంగు సోకిన కాయలను తోటలో ఉంచకూడదు. తోటలో అంతరకృషి బాగా చేసి పరిశుభ్రత పాటించాలి.
వాతావరణంలో మార్పులతో..
వేడి వాతావరణానికి మారుతున్న సమయం, వర్షాభావ పరిస్ధితులు మంగు ఉధృతికి ఎక్కువగా దోహదం చేస్తాయి. ఇటీవలి వరకు రాత్రి వేళల్లో మంచు కురవడం, ఉదయం బాగా ఎండ తీవ్రంగా ఉండటం మంగు ఉధృతికి అనుకూలంగా ఉంటుంది.
పంటను కాపాడుకునేందుకు ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి సూచనలు


