● చికిత్స పొందుతూ యువకుడు మృతి
పెద్దఅడిశర్లపల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణానికి చెందిన జహంగీర్ (23)అంగడిపేట ఎక్స్‌రోడ్ వద్ద తన తండ్రితో కలిసి బ్యాటరీ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన బ్యాటరీ షాపును మూసివేసి తిరుగుపయనంలో ఇంటికి వెళ్తుండగా చిల్కమర్రి స్టేజి సమీపంలో అతడి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో
ఒకరికి తీవ్రగాయాలు
మర్రిగూడ: ఆటో, బైక్ ఢొకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మర్రిగూడ మండలంలోని బట్లపల్లి గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు చెట్టును
ఢీకొని వ్యక్తి మృతి
తిప్పర్తి: కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్ద చోటు చేసుకుంది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతానికి చెందిన దిట్టకవి శ్రీనివాస్(58) ఈనెల 10న హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ఫ్రయాణంలో భాగంగా మంగళవారం తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొంది. దీంతో శ్రీనివాస్‌కు బలమైన గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య దిట్టకవి సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ అప్జల్ అలీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలు
● రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పోతినేని సుదర్శన్
నల్లగొండ టౌన్ : భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతాంగ ఉద్యమాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్‌లో రైతు సంఘం నల్లగొండ జిల్లా 24వ మహాసభలో వారు మాట్లాడారు. పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్, యూరియా అమ్మకం యాప్‌లు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వి.వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లయ్య, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, అయితరాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు.


