ఆలేరురూరల్ : సుమారు రూ.కోటి విలువ చేసే పాన్ మసాలాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురైన కేసులో ఒకరిని మంగళవారం ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ యాలాద్రి వెల్లడించారు. హర్యానా నుంచి హైదరాబాద్‌కు పాన్ మసాలా లోడ్‌తో వస్తున్న కంటైనర్ ఏప్రిల్ మొదటి వారంలో ఆలేరు సమీపంలో అదృశ్యమైందని న్యూఢిల్లీకి చెందిన కంటైనర్ యజమాని వినోద్ ఉపాధ్యాయ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన కంటైనర్ డ్రైవర్ సద్దాం, అతడి స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన సిరాజ్‌తో కలిసి ఈచోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. ఆలేరు బైపాస్‌లో క్రషర్ వద్ద కంటైనర్‌ని నిలిపి అందులోని 296 కాటన్ల పాన్ మసాలా ప్యాకెట్లను వేరే వాహనంలోకి మార్చారు. తిరిగి కంటైనర్ వాహనాన్ని జనగాం జిల్లా రఘునాథ్‌పురం మండలం కోమలి హైవే పక్కను నిలిపేశాడు. అనంతరం ఆ సరుకును హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రాంతంలోని ఒక గోదాముకు తరలించారు. సద్దాం, సీరజ్ కలిసి అక్కడ దాచిపెట్టి విక్రయించాలని పథకం వేశారు. పోలీసులు డ్రైవర్ సద్దాం ఫోన్ నంబర్ సాయంతో ట్రాక్ చేశారు. చంచల్‌గూడలోని అతడి స్నేహితుడు సీరాజ్ ఇంట్లో ఉన్న సద్దాంను పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గోదాంలో నిలిపి ఉంచిన పాన్ మసాలా కాటన్లను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందులో దాదాపు రూ.79 లక్షల విలువ గల 236 కాటన్ల పాన్ మసాలను రికవరీ చేసినట్లు చెప్పారు. మిగతా 60 కాట్లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సద్దాంను రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మరో నిందితుడు సీరాజ్ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సీజ్ చేసిన పాన్ మసాలా కాటన్లను ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు


