భూదాన్‌పోచంపల్లి: మండలంలోని గౌస్‌కొండ గ్రామంలో చెరువులో మునిగి గల్లంతైన పాండాల శివ (24) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. రెస్క్యూ టీమ్, పోలీసులు సంయుక్తగా గల్లంతైన శివ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా.. చెరువు మధ్యలో శివ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని చెరువు నుంచి బయటికి తీసి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమ్తితం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు
తన కుమారుడు శివను తోటి స్నేహితులే కొట్టి చంపి చెరువులో పడేశారని మృతుడి తల్లి మనోహర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మద్యం మత్తులో ఉన్న స్నేహితులు, శివతో ఘర్షణ పడ్డారని. ఘటన జరిగిన మధ్యాహ్న సమయంలో సమీపంలో ఉన్న రైతులు వీరి కొట్లాడిన మాటలు విన్నారని చెప్పింది. అంతేకాక శివ ముఖం వద్ద గాయాలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. మృతుడి తల్లి మనోహర ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. పాండాల శివ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.


