యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో భక్తుల నుంచి సేకరించి, తిరిగి భక్తులకు మొక్కు వస్త్రాలను విక్రయించే టెండర్ నోటిఫికేషన్ వేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అన్నల్దాస్ వెంకటేష్ మంగళవారం ఆలయాధికారులకు వినతి పత్రం అందజేశారు. కొండపైన శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించే వస్త్రాలను సేకరించి, భక్తులకు మొక్కు వస్త్రాలను విక్రయించే టెండర్ల గడువు పూర్తి అయినా ఆలయాధికారులు మాత్రం టెండర్ల ప్రకటన జారీ చేయడం లేదన్నారు. దీంతో దేవస్థానానికి ఆర్థిక నష్టం కలుగుతుందని పేర్కోన్నారు. దేవస్థానం ఆదాయానికి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్థిక సమానత్వంతోనే కులనిర్మూలన సాధ్యం
భువనగిరిటౌన్ : ఆర్థిక సమానత్వంతోనే కులనిర్మూలన సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత రాజ్యాంగం – సామాజిక న్యాయం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, హక్కులు, అవకాశాలను కల్పించిందన్నారు. మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షత వహించిన సదస్సులో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, మండల నాయకులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కష్ణ, కొండమడుగు నాగమణి, మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, రజక వత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సురుపంగ ప్రకాష్, అనాజిపురం సర్పంచ్ రాయపురం సురేష్, నాయకులు ఏదునూరి వెంకటేష్, మచ్చ భాస్కర్, కొల్లూరి సిద్ధిరాజు, నరాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
బెల్టుషాపులు నిషేధించాలని తీర్మానం
రాజాపేట : రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం గ్రామంలో బెల్టుషాపులు నిషేధించాలని మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మే 1 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించొద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నిడింటి నరేష్, ఉప సర్పంచ్ వెంకటేశం, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఆవుదూడకు ఆర్థోపెడిక్ సర్జరీ
కోదాడరూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి తుంటిఎముక విరిగిన ఆవుదూడకు ఆరు గంటలు శ్రమించి ఆర్థోపెడిక్ సర్జరీ చేశారు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు. నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన పశు పోషకుడు హైదరాబాద్ నుంచి గిర్ రకానికి చెందిన ఆవుదూడను ఆటోలో తీసుకొస్తుండగా చౌటుప్పల్ వద్ద ఆటోలోంచి కిందికి దూకింది. ఈ ప్రమాదంలో దూడ తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. దానిని చికిత్స కోసం సోమవారం కోదాడ పశువైద్యశాలకు తీసుకొచ్చారు. ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు భూక్యా మధు, డాక్టర్ సిరిపురపు సురేంద్ర సాయంత్ర 4 గంటల నుంచి రాత్రి 10 వరకు శ్రమించి విరిగిన ఎముకకు రాడ్లు వేసి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. అదే సమయంలో కోదాడకు వచ్చిన జిల్లా పశువైద్యాధికారి బి. శ్రీనివాసరావు డాక్టర్ పెంటయ్యను అభినందించారు.


