తొలిరోజే పాఠ్య పుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజే పాఠ్య పుస్తకాలు

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

పిల్లలను ప్రభుత్వ

పాఠశాలల్లో చేర్పించాలి

రామన్నపేట: పాఠశాలల పునఃప్రారంభమయ్యే తొలి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో పాఠశాల ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు వివిధ దశల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగేది. కొన్ని పుస్తకాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆయా సబ్జక్టులో వెనుక బడేవారు. ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా పాఠ్యపుస్తకాలు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుస్తకాలు నిల్వ ఉంచడానికి విద్యాశాఖ గోదాము ఖాళీ లేదు. దీంతో ఇతర శాఖల గోదాములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

46,107 మంది విద్యార్థులు

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, పదిహేడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 46,107 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. వీరికి 3,92,250 పుస్తకాలు అవసరమని అధికారులు గుర్తించారు. కొన్ని జిల్లాలకు సంబంధించి మొదటిదశ పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలలోని గోదాములకు చేరుకున్నాయి. యాదాద్రి జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన గోదాము ఖాళీగా లేకపోవడంతో ఇతర శాఖల పరిధిలోని గోదాముల కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలను ఒకే విడతలో తెప్పించే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి పాఠ్యపుస్తకాలు చేరిన వెంటనే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధి పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

ప్రవేశాలు పెంచడం ద్వారా..

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం ద్వారా వాటి బలోపేతానికి అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలతో చాలా చోట్ల ఇప్పటికే ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడి ఈడు పిల్లలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులను కలుస్తున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్‌కు పునాదులు వేయాలి.

–సత్యనారాయణ, డీఈఓ భువనగిరి

పాఠశాలలు, విద్యార్థులు ఇలా

ప్రభుత్వ 1,941

కేజీబీవీ 1,606

ఎంజేపీటీబీ 1,557

మండల/జెడ్పీ 34,221

మైనార్టీ గురుకులాలు 638

సాంఘిక సంక్షేమ గురుకులాలు 2,538

గిరిజన సంక్షేమ గురుకులాలు 290

మోడల్‌ స్కూళ్లు 1,865

తెలంగాణ గురుకులాలు 1,402

అర్బన్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ 49

మొత్తం విద్యార్థులు 46,107

మొత్తం టైటిల్స్‌ 221

కావాల్సిన పుస్తకాలు 3,92,250

ఫ పాఠశాలల పునః ప్రారంభం రోజే ఇచ్చేందుకు కసరత్తు

ఫ 3,92,250 పుస్తకాలు అవసరమని అంచనా

ఫ విద్యాశాఖ గోదాము ఖాళీలేక ఇతర శాఖలవి తీసుకోవడానికి యత్నం

Advertisement
 
Advertisement
Advertisement