నేతన్నలకు ఆరోగ్య మస్తు | - | Sakshi
Sakshi News home page

నేతన్నలకు ఆరోగ్య మస్తు

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

భూదాన్‌పోచంపల్లి, భువనగిరి టౌన్‌ : వస్త్ర సృష్టిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న చేనేత కార్మికుల చెంతకే వైద్య సేవలను తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నిరంతరం కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే వెన్నునొప్పి, కంటి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు ఈ శిబిరాల్లో చికిత్స అందించనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా హెల్త్‌ క్యాంప్‌లను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

మే 13వరకు కొనసాగింపు

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 10,323 మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా చేనేత, జౌళిశాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. మే 13 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ శిబిరాలలో జనరల్‌ ఫిజీషియన్‌, కంటి, ఎముకల వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నారు. అదేవిధంగా కార్మికులకు సాధారణ బీపీ, షుగర్‌ పరీక్షలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా మండల కేంద్రాల్లో గుర్తించిన ప్రదేశాలు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన టెక్నీషియన్స్‌తో పాటు వైద్యనిపుణులు శిబిరాల్లో అందుబాటులో ఉంటారు.

శిబిరాలు ఇలా...

ఈనెల 16న ఆలేరులోని గౌడ సంఘం భవనంలో వైద్య శిబిరం నిర్వహిస్తారు. 17న ఆత్మకూర్‌(ఎం) పీహెచ్‌సీ, 18న భువనగిరి యూపీహెచ్‌సీ, 20 నుంచి 23 వరకు చౌటుప్పల్‌ మార్కండేయ దేవాలయం దగ్గర కొయ్యలగూడెం వీవర్‌ బిల్డింగ్‌, కుంట్లగూడెంలో, 24న మోటకొండూర్‌ పీహెచ్‌సీ, 25న మోత్కూర్‌ పీహెచ్‌సీ, 27 నుంచి మే 2 తేదీ వరకు పోచంపల్లి చేనేత డైహౌజ్‌, మే 4న రాజాపేట పీహెచ్‌సీ, 5, 6 తేదీలలో రామన్నపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, 7న వలిగొండ పీహెచ్‌సీ, 8న యాదగిరిగుట్ట పీహెచ్‌సీ, 11న గుండాల పీహెచ్‌సీ, 12న నారాయణపురం పీహెచ్‌సీ, 13న పుట్టపాక క్లస్టర్‌ భవనంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు

ఫ రేపటి నుంచి వైద్య శిబిరాలు

Advertisement
 
Advertisement
Advertisement