ఉత్తీర్ణత సాధించేలా.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తీర్ణత సాధించేలా..

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

గతంలో కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది

భువనగిరి: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు తప్పిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా బుధవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. కొన్ని కళాశాలల్లో ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించే అవకాశం ఉండగా మరికొన్ని కళాశాలల్లో ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపు ద్వారా పాఠాలు బోధించనున్నారు.

కొన్ని కళాశాలల్లో ఆశించిన స్థాయిలో

రాని ఫలితాలు

జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. తల్లిదండ్రుల సమావేశం వంటి వాటిని ఏర్పాటు చేసినా కొన్ని కళాశాలల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ సారి ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,346 మంది పరీక్షకు హాజరు కాగా 720 మంది ఉత్తీర్ణత సాధించి 53.49 శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 1,166 మంది హాజరు కాగా 815 మంది ఉత్తీర్ణత సాధించగా 69.90 శాతం నమోదైంది. బొమ్మలరామారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో మొత్తం 24 మందికి నలుగురు, ప్రథమ సంవత్సరంలో 41 మందికి ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

పరీక్షలు మంచిగా రాసేలా..

ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో కొన్ని కళాశాలల్లో ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించే అవకాశం ఉండగా మరికొన్నింటిలో అధ్యాపకులు ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. పరీక్షలు సక్రమంగా రాసేలా సన్నద్ధం చేయనున్నారు. వారంలో రెండు నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తరగతులు ఈ నెల 15 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

గతంలో కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ర్యాంకులో తేడా ఉత్తీర్ణత శాతం పెరగడంతో గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణులుకాని విద్యార్థులకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇచ్చాం.

– రమణి, డీఐఈవో

ఫ ఇంటర్‌ తప్పిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ఫ నేటి నుంచి ఆన్‌లైన్‌లో గానీ ఆఫ్‌లైన్‌లో గానీ నిర్వహణ

ఫ వారంలో రెండు నమూనా పరీక్షలు

Advertisement
 
Advertisement
Advertisement