తుర్కపల్లి : మండలంలోని తిరుమలపూర్, వీరారెడ్డిపల్లి గ్రామాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తిరుమలపూర్లో భువనగిరి–గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు ఎండిపోయి, సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పంటలకే కాకుండా, పశువులకు కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, కాల్వల ద్వారా ఈ చెరువులకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నూకల శ్రీనివాస్ యాదవ్, రామకృష్ణరెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, సందీప్, శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.
14న భీమ్ యాత్ర
భువనగిరిటౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ కోరారు. ఆదివారం వారు భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 14న ఉదయం 8 గంటలకు హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కర్తల శ్రీనివాస్, సజావుద్దీన్, కూతాడి సురేష్, ఇటుకల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


