యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చనలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం విశేషంగా నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

మూసీ ప్రక్షాళనపై

శ్రద్ధలేని ప్రభుత్వం

భూదాన్‌పోచంపల్లి : ప్రభుత్వానికి మూసీనది సుందరీకరణపై ఉన్న శ్రద్ధ, దాని ప్రక్షాళనపై లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీని పూర్తిగా ప్రక్షాళన చేసి పరీవాహక ప్రాంత గ్రామాలకు కాలుష్యరహిత సాగునీటిని అందించాలని కోరారు. మదర్‌డైరీ రైతులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెద్దరావులపల్లి నుంచి పోచంపల్లి వరకు పూర్తిగా ధ్వంసమై, అధ్వానంగా మారిన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గోడళ్ల నాగభూషణంగౌడ్‌, గీత పనివారల సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు యాదయ్య, మాజీ మండల కార్యదర్శి భీమగాని నర్సింహ, పార్టీ నాయకులు సంగెం గణేశ్‌, కొమ్ము బాలనర్సింహ, కంటె శ్రీశైలం, పర్వతం రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement