ఎండల నుంచి పండ్ల తోటల రక్షణ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఎండల నుంచి పండ్ల తోటల రక్షణ ఇలా..

Apr 13 2026 7:08 AM | Updated on Apr 13 2026 7:08 AM

గుర్రంపోడు : అధిక ఉప్ణోగ్రతలు పండ్ల తోటలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వేసవిలో పండ్ల తోటల్లో సరైన నీటి యాజమాన్యం పాటించకపోతే తెగుళ్ల బారిన పడతాయి. ప్రధానంగా బత్తాయి తోటల్లో ఏటా కొన్ని చెట్లు వేరుకుళ్లు బారిన పడటం జరుగుతుంది. వేసవిలో పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన నీటి యాజమాన్య పద్ధతుల గురించి హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు ఇలా..

సరైన నీటి యాజమాన్యం కీలకం

నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్న చోట్ల వేసవిలో చెట్ల పాదుల్లో తడారిపోకుండా ఆకులు లేదా ఊకతో కప్పి ఉంచాలి. ఇలా మల్చింగ్‌ వల్ల నీటి అవసరం 20 నుంచి 30 శాతం తగ్గుతుంది. ఉదయం, సాయంత్ర వేళ నీరు అందించాలి. చెట్టు పాదులోని మట్టి ఎప్పుడూ చేతితో పట్టుకుంటే ముద్దకానంతగా పదునుతో ఉండాలి. తడి ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు. డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంలో ప్రతిరోజు కనీసం మూడు గంటలు నీరు అందించాలి. చెట్టుకు కనీసం 4 నుంచి 8 డ్రిప్పర్లు చెట్టు వయస్సును బట్టి ఏర్పాటు చేసుకోవాలి. మధ్యాహ్నం సూర్యకాంతి నుంచి రక్షణ కల్గించేలా చిన్న పండ్ల మొక్కలకు షేడ్‌ నెట్‌ లేదా తాటి ఆకులతో నీడనివ్వాలి. ముందుగా తోటలో ఆరోగ్యంగా లేని మొక్కలను గుర్తించి ఎండ నుంచి తట్టుకునేలా చేయాలి. మార్కెట్‌లో లభించే ఒత్తిడిని తట్టుకునే యాంటీ స్ట్రెస్‌ ద్రావణాలు వాడవచ్చు. ఇవి ఆకులపై తెల్లటి పొరలా ఏర్పడి సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.

సేంద్రియ పదార్ధాల వినియోగం తప్పనిసరి

నేలలో తగినంత సేంద్రియ ఎరువులు పశువుల పేడ, వర్మీ కంపోస్టు లాంటివి నీటి ఎద్దడిని, ఎండ తీవ్రతను కొంతవరకు తట్టుకుంటాయి. పండ్ల తోటల్లో సేంద్రియ ఎరువులతో పాటు వర్షాకాలంలో జనుము, మినుము, జీలుగ లాంటి పంటలు వేసి దుక్కిలో దున్నుకుంటే నేల సారవంతమై నీటి ఎద్దడి తట్టుకుంటుంది.

నీటి ఎద్దడితో వేరుకుళ్లు తెగులు

ప్రధానంగా పండ్ల తోటల్లో నీటి ఎద్దడి వల్ల వేరుకుళ్లు తెగులు సోకుతుంది. నీరు పెట్టినా వాడి పట్టినట్లు కనిపించడం ఈ తెగులు ప్రధాన లక్షణం. నీటి ఎద్దడి వల్ల అనేక శిలీంధ్రాలు విజభించి వేరకుళ్లు తెగులుకు దోహదం చేస్తాయి. నేలలో తడి ఎక్కువైనా, నీటి ఎద్దడికి గురైనా వేరుకుళ్లు తెగులు వ్యాపిస్తుంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చెట్లను బతికించుకునే అవకాశం ఉంటుంది. చెట్టుకు పది కిలోల చొప్పున వద్ది చేసిన ట్రై కోడర్మాను పది కిలోల వంతున పాదులో వేయాలి. నీరు కట్టిన మరుసటి రోజు 40 గ్రాములు కార్బండిజం, 50 గ్రాములు మాంకోజెబ్‌లు 20 లీటర్ల నీటిలో కలిపి పాదంతా తడిచేలా చేయాలి. మల్టీకే లాంటి నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేయాలి.

హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు

Advertisement
 
Advertisement
Advertisement