రూ.2కోట్లు స్వాహా చేసిన బ్యాంక్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి..? | - | Sakshi
Sakshi News home page

రూ.2కోట్లు స్వాహా చేసిన బ్యాంక్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి..?

Apr 13 2026 7:08 AM | Updated on Apr 13 2026 7:08 AM

దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని ఓ బ్యాంక్‌లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి రూ.2కోట్లకు పైగా నగదును డిజిటల్‌ పద్ధతిన స్వాహా చేసి పరారైనట్లు ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దేవరకొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఓ బ్యాంకులో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దీర్ఘకాలికంగా డబ్బులు డ్రా చేయని ఖాతాలను ఎంచుకొని డిజిటల్‌ పద్ధతిన ఖాతాదారులకు తెలియకుండా దాదాపు రూ.2కోట్ల మేర లావాదేవీలు జరిపి పరారైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా బ్యాంక్‌కు సెలవులు ఉండడంతో ఎవరి ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ అయ్యిందో తెలియడంలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవరకొండ పోలీసులు తెలిపారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

మద్దిరాల : వడదెబ్బతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మద్దిరాల మండలం చౌళ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజానాయక్‌తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానాయక్‌తండాకు చెందిన బానోత్‌ సైదులు(45) వ్యవసాయ పనులను చేసుకొని మధ్యాహ్నం చేను వద్ద నుంచి ఇంటికి వస్తుండగా వడదెబ్బ కారణంగా మార్గమధ్యలో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇరు వర్గాల మధ్య

చేపల పంచాయితీ

మోతె : తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం రెండు వర్గాల మధ్య చెరువులో చేపలు పట్టే విషయమై పంచాయితీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి గ్రామంలోని కన్నె చెరువులో సంవత్సర కాలం నుంచి ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు సొంత ఖర్చులతో చేప పిల్లలు పెంచుతున్నారు. గత వారం నుంచి చేపలు పట్టేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ముదిరాజు కులస్తులు చేపలు పట్టేందుకు ఆదివారం చెరువు వద్దకు వెళ్లారు. దీంతో వారిని ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు అడ్డుకున్నారు. కన్నె చెరువు తమ పట్టా భూముల్లో కొంత మేరకు ఉన్నందున చేపలు పెంచుతున్నామని ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు బదులిచ్చారు. సమాచారం తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని ఇరు వర్గాల సభ్యులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా..

డ్రైవర్‌ మృతి

నిడమనూరు : ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడి డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలంలోని వడ్డెరిగూడెం – కుంటిగోర్లగూడెం గ్రామాల మధ్యన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సురేష్‌(35) వరికోత మిషన్‌ డ్రైవర్‌గా పనిచేసేందుకు సాగర్‌ ఆయకట్టుకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం వరికోత యంత్రాన్ని నిడమనూరు మండలంలోని వడ్డెరిగూడెం శివారు నుంచి కుంటిగొర్లగూడెం తరలించేందుకు ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ నడుపుతున్న సురేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. నిడమనూరు ఎస్‌ఐ ఉప్పు సురేష్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement