రామగిరి(నల్లగొండ): అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్న విప్స్ కంపెనీ ఏజెంట్లను నల్లగొండ రూరల్ అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఏఎస్పీ రమేష్ ఆదివారం వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన వినోద్ తుకారాం ఖుటే విప్స్ వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించాడు. 2018లో దానిని విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌గా మార్చి వివిధ రకాల సేవల పేర్లతో అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అంటూ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏజెంట్లను నియమించుకుని అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించారు. కమిషన్ వ్యవస్థ, ట్రేడింగ్, ప్రాపర్టీస్, మర్చంట్, క్యూఆర్ కోడ్ పేరుతో దుకాణాలు, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా నమ్మించి మోసం చేశారు.
కొత్త యాప్‌తో మరోసారి మోసం..
విప్స్ కంపెనీకి చెందిన ఏజెంట్లు శనివారం నల్లగొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో పాత కస్టమర్లతో సమావేశం ఏర్పాటు చేసి వేవ్ అనే కొత్త యాప్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని ప్రచారం చేశారు. సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన కానాల లక్ష్మీనారాయణరావు, నకిరేకల్ మండలం మర్రూర్‌కు చెందిన పున్నం బాలకృష్ణ, చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన ఉయ్యాల శ్రీనివాస్, నల్లగొండ పట్టణానికి చెందిన కురాకుల రమేష్, మాదగోని సైదులు, కనగల్ మండలం దోరెపల్లికి చెందిన గాజుల మహేష్, నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన కోల కుశలయ్య, అప్పాజీపేటకు చెందిన ఓరుగంటి శంకర్, కట్టంగూర్ మండలం మునుకుంట్లకు చెందిన ముడుసు ఉమాశంకర్, కట్టంగూర్ మండలానికి చెందిన గుడపూరి లింగస్వామి ఉన్నారు. విప్స్ గ్రూప్ సీఈఓ వినోద్ తుకారాం ఖుటే, డైరెక్టర్లు సుమిత్ పురాంక్, సౌతిండియా డెవలప్‌మెంట్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డైరెక్టర్లు గుమ్మల సత్యనారాయణ, గుమ్ముల అభినాష్ పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్‌ఐ సైదాబాబు, సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ఏఎస్పీ రమేష్ సూచించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కొత్త యాప్ పేరుతో పాత కస్టమర్లను మోసం చేసేందుకు యత్నం
వివరాలు వెల్లడించిన
నల్లగొండ ఏఎస్పీ రమేష్


