నాగార్జునసాగర్ : రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా (ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డయాబెటీస్ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి వెయ్యికి పైగా వైద్యులు పాల్గొని మధుమేహంపై తాజా అధ్యయనాలపై చర్చించారు. ఈ రెండు రోజుల్లో 30కి పైగా శాసీ్త్రయ ఉపన్యాసాలు, 15 పేపర్ ప్రజెంటేషన్లు, 10 పోస్టర్ ప్రజెంటేషన్లు, 5 వర్క్‌షాపులు విజయవంతంగా నిర్వహించారు. యువ వైద్యులు, పీజీ విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించి నిపుణుల సలహాలు, సూచనలు పొందారు. సదస్సు ముగింపు సందర్భంగా ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. సదస్సులో పాల్గొన్న వైద్యులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. వలంటీర్లు, స్పాన్సర్లను ప్రత్యేకంగా సన్మానించారు.
గ్రామానికి కీడు సోకిందని..
● వనవాసం వెళ్లిన కట్టంగూర్ వాసులు
కట్టంగూర్ : గ్రామానికి కీడు సోకిందని ప్రజలంతా వనభోజనానికి వెళ్లారు. ఈ సంఘటన కట్టంగూరు మండల కేంద్రంలో ఆదివారం చోటచేసుకుంది. ఏడాది కాలంగా కట్టంగూర్‌లో వరుస మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వృద్ధులతో పాటు యువకులు మరణిస్తుండటంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన స్థానికులు, పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు పురోహితుడిని సంప్రదించారు. దీంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులంతా ఒక రోజు ఊరు విడిచి వనవాసం వెళ్లాలని పురోహితుడు సూచించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్తులంతా ఇల్లు వాకిలి ఊడ్చకుండానే ఇళ్లకు తాళం వేసి సకుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లారు. సంప్రదాయంగా వ్యవసాయ బావుల వద్ద వంటలు చేసుకొని అక్కడే భోజనం చేసి సాయంత్రం ఇళ్లకు తిరిగివచ్చారు.


