బొంగోనిచెర్వు గ్రామ పరిధిలోని నోష్ ల్యాబ్స్‌లో ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం శుక్రవారం రసాయన పరిశ్రమను సందర్శించి రియాక్టర్ లీకేజీ అయిన బ్లాక్–2ను పరిశీలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరిశ్రమలోని కార్మికుల భద్రత ప్రమాణాలపై, పరిశ్రమ నిర్వహణ అనుమతులు, నిర్మాణ అనుమతులపై నివేదిక ఇవ్వాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవిని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా.. మానవతప్పిదంతో జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. వారి వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్ ఉన్నారు.


