మాగేస్తే ఎండుగడ్డిలోనూ పోషకాలు | - | Sakshi
Sakshi News home page

మాగేస్తే ఎండుగడ్డిలోనూ పోషకాలు

Apr 11 2026 7:28 AM | Updated on Apr 11 2026 7:28 AM

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పశువులు యూరియానుగాని, యూరియా నీళ్లనుగాని తాగకుండా జాగ్రత్త పడాలి. పొరల మధ్య గాలి ప్రవేశించకుండా తొక్కడం, తాళ్లతో బంధించడం చేయాలి. తమకున్న పశువుల సంఖ్య ఆధారంగా 3 మాసాలకు సరిపోయే వరిగడ్డిని మాగేసుకుని, ఒక వాము వాడటం ప్రారంభించగానే మరొకటి తయారు చేసుకోవాలి.

గుర్రంపోడు : వేసవిలో పచ్చిమేత లభ్యత తక్కువగా ఉంటున్న కారణంగా పలువురు రైతులు ఎండుగడ్డిపై ఆధారపడుతుంటారు. పచ్చిమేతలో ఉండే పోషకాలు ఎండిన వరిగడ్డిలో ఉండకపోవడంతో పశువులు బక్కచిక్కిపోతుంటాయి. మెళకువలు పాటిస్తే ఎండిన వరిగడ్డిలోనూ పోషకాలు పెరిగి పచ్చిమేతగా మారుతుందని గుర్రంపోడు మండల పశువైద్యాధికారి సాయిరామ్‌ పేర్కొంటున్నారు.

అన్ని కాలాల్లో వినియోగం

పశుపోషణకు రైతులు పచ్చిగడ్డితోపాటు ఎండుగడ్డిని కూడా అందిస్తుంటారు. సాధారణంగా వేసవిలో పచ్చిగడ్డి కొరత కారణంగా ఎండుగడ్డిని ఎక్కువగా వినియోగిస్తారు. ఎండుగడ్డితోపాటు జొన్న, మొక్క జొన్న, చొప్ప తదితర రకాలను కూడా ఎండబెట్టి ఆహారంగా వినియోగిస్తారు. వరికోతల అనంతరం రైతులు ఎండుగడ్డిని నిల్వ చేసి పశువులకు వేస్తారు. వాటికి కావాల్సిన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఎండుగడ్డిలో లభించవు. జీర్ణం కాని పీచు పదార్థమే వరిగడ్డిలో అధికంగా ఉంటుంది. అయితే ఎండుమేతను కూడా నాణ్యతను పెంచుకుని పశువులకు ఆహారంగా వినియోగిస్తే అన్నికాలాల్లో పచ్చిమేతగా ఉపయోగించవచ్చు.

వరిగడ్డిని మాగేసే విధానం..

ఎండుగడ్డిని యూరియా ద్రావణంలో ఊరేస్తే పోషక విలువలు పెరుగుతాయి. 60 లీటర్ల నీటిలో నాలుగు కిలోల యూరియాను కరిగించాలి. 100 కిలోల వరిగడ్డిని పొరలు, పొరలుగా వేస్తూ ప్రతి పొరపై నీళ్లు చిలకరించాలి. పొరల మధ్య గాలి ప్రవేశించకుండా తొక్కాలి. పెద్ద మొత్తంలో యూరియా గడ్డి తయారీకి వాము వేసి టార్పాలిన్‌ను కప్పాలి. 10 రోజలు తర్వాత తీసిచూస్తే, అమ్మోనియా వాసన కలిగి గోధుమరంగుకు మారిన మాగేసిన వరిగడ్డి పశువులు తినడానికి సిద్ధంగా ఉంటుంది.

ప్రయోజనాలు

యూరియా ద్రావణంలో మాగేసిన వరిగడ్డిని వాడటం వల్ల వరిగడ్డి నాణ్యత పచ్చిగడ్డి మేతతో సమానంగా ఉంటుంది. జీర్ణమయ్యే మాంసకృత్తులు లేని వరిగడ్డిలో మాగవేయడం ద్వారా నాలుగు శాతం మాంసకృత్తులు లభ్యమవుతాయి. యూరియా గడ్డి గోధుమ రంగులో ఉండి, అమ్మోనియా వాసన కలిగి, రుచికి తీయగా, మెత్తగా ఉండటం వల్ల ఇష్టంగా తింటాయి. గడ్డిలోని పోషక పదార్థాలు మూడు మాసాల వరకు నిల్వ ఉండి వినియోగమవుతాయి. వరిగడ్డిలో జీర్ణంకాని సెల్యులోజ్‌, హెమి సెల్యులోజ్‌ పీచుపదార్థాలు ఊరేసిన తర్వాత సులభంగా జీర్ణమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement