మహిళను వేధించిన వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

మహిళను వేధించిన వ్యక్తిపై కేసు

Apr 11 2026 7:28 AM | Updated on Apr 11 2026 7:28 AM

అడ్డగూడూరు: ఉపాధి హామీ పనుల్లో మహిళను వేధించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో తాత్కాలిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈదుల రమేష్‌ అనే వ్యక్తి తనతో అసభ్యకరంగా మాట్లాడాడని అదే గ్రామంలోని ఓ మహిళా కూలీ వాపోయింది. తన కోరిక తీరిస్తేనే ఉపాధి పనులకు రానిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. గతంలో వాట్సాప్‌ వీడియో కాల్‌ మాట్లాడిన సమయంలో స్క్రీన్‌షాట్‌ తీసి ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడని, వాట్సాప్‌ డీపీగా కూడా పెట్టాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పార్కింగ్‌ చేసిన

రెండు బైక్‌లు చోరీ

కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పట్టణంలో గురువారం అర్ధరాత్రి పార్కింగ్‌ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. పట్టణ కేంద్రంలోని సాగర్‌ రోడ్డులో గల క్రాంతి మొబైల్‌ షాప్‌ ఎదురుగా పార్కింగ్‌ చేసిన షేక్‌ మగ్బూల్‌కు చెందిన బైక్‌, అదేవిధంగా జేబి కాలనీలో వైన్స్‌ ఎదుట ఉన్న కాలనీలో ఉన్న నరేష్‌కు చెందిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వాహన యజమాని షేక్‌ మగ్బూల్‌ ఉదయం ఐదు గంటలకు తన వాహనం కోసం వచ్చి చూడగా బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ దర్యాప్తు చేపట్టారు.

వాహనాన్ని అడ్డగించి..

బైక్‌తోపాటు సెల్‌ఫోన్‌ చోరీ

మిర్యాలగూడ టౌన్‌ : వాహనాన్ని అడ్డగించి బైక్‌తో పాటు సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. ముల్కలకాలువ గ్రామానికి చెందిన మహేష్‌ బైక్‌పై మిర్యాలగూడకు వెళ్తుండగా రాయినిపాలెం గ్రామ శివారులో గుర్తు తెలియని దుండుగులు 8 మంది దారిలో వాహనాన్ని అడ్డగించారు. అతడి బైక్‌తో పాటు సెల్‌ఫోన్‌ కూడా ఎత్తుకెళ్లారు. స్థానికులు వారిని వెంబడించగా ఒకరు పట్టుబడ్డారు. మిగిలిన ఏడుగురు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి మిర్యాలగూడ రూరల్‌ పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.

కాపురానికి

తీసుకెళ్లడం లేదని..

భర్త ఇంటి ముందు మౌన పోరాటం

మోతె : కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన మోతె మండంలోని ఉర్లుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఉర్లుగొండ గ్రామానికి చెందిన కోళ్ల వీరభద్రం –పద్మ దంపతుల కుమారుడు కోళ్ల సాగర్‌.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన సిరికొండ శ్రీలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన సాగర్‌ గత కొంత కాలంగా తన తల్లి ఇంటి వద్దనే తనను వదిలేశాడని, కాపురానికి తీసుకెళ్లడం లేదని పేర్కొంటూ అత్తింటి ముందు మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement