చిట్యాల: చిట్యాల మండల పరిధిలో వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో తరచుగా పేలుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గురువారం సాయంత్రం బొంగోనిచెర్వు గ్రామ పరిధిలో గల నోష్ ల్యాబ్స్‌లో రియాక్టర్ లీకేజీతో జరిగిన పేలుడులో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడం గ్రామానికి చెందిన ముశం లక్ష్మణ్‌కుమార్, ఖమ్మం జిల్లా ముదికొండ గ్రామానికి చెందిన మిరికంటి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు గాయపడ్డారు.
తనిఖీలు చేయాల్సి ఉన్నా..
గత మూడేళ్ల కాలంలో వెలిమినేడు పరిధిలోని హిండస్, దశమి, రిత్వీక్ బయో ఫ్యూయల్స్ పరిశ్రమల్లో, గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని శ్రీపతి ల్యాబ్స్, ఆరేగూడెం పరిధిలోని వేస్టేజ్ మేనేజ్‌మెంట్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఎన్నో పేలుడు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరిగినప్పడు గాయపడిన, మృతి చెందిన వారి వివరాలను ఆయా పరిశ్రమల యజమాన్యాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండటంతో ప్రమాదం జరిగినప్పుడు వారిని గుట్టుచప్పుడు కాకుండా వారి ఇంటికి పంపించి వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరిశ్రమల శాఖల అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఫ తరచూ జరుగుతున్న ప్రమాదాలతో భయాందోళనలో కార్మికులు
ఫ భద్రతా ప్రమాణాలు
పాటించని పరిశ్రమలు
ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ


