చివ్వెంల(సూర్యాపేట) : మండల పరిధిలోని ఎంజీనగర్ తండాలో శుక్రవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రత్నావత్ ఆనంద్– మంజుల పెద్ద కుమారుడు రత్నావత్ మణిభార్గవ్ (22) డిగ్రీ వరకు చదివి, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం ఆటోలో కిరాయికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళకు చెందిన వ్యవసాయ భూమిలో మణిభార్గవ్ మృతి చెంది ఉన్నాడు. చుట్టుపక్కల రైతులు గమనించి తల్లిదండ్రులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. పోలీసులకు విషయం తెలపడంతో డీఎస్‌పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు కనకరత్నం, బత్తిని శ్రీకాంత్, గోపి కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.
వివాహేతర
సంబంధమే
కారణమా?
మృతుడు మణిభార్గవ్ గత రెండు సంవత్సరాలుగా గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి ఆ మహిళ ఫోన్ చేయడంతో మణిభార్గవ్ అక్కడకు వెళ్లినట్లు సమాచారం. మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త గమనించడంతో, ఇద్దరు కలిసి హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సంఘటన స్థలంలో కత్తులు లభ్యం కావడం, వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ కనిపించకపోవడంతో భార్గవ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


