పెద్దవూర: భూమిలో కర్బన శాతాన్ని (సేంద్రియ పదార్థాల పరిమాణం) పెంచడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చని భూ పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త అరిఫ్‌ఖాన్ అన్నారు. శుక్రవారం పెద్దవూర మండలంలోని పులిచర్ల గ్రామంలో రైతులకు ఈ– బయోచార్ సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ– బయోచార్ తయారీలో 9 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో గుంతను ఏర్పాటు చేసుకుని వానిలో పత్తి కర్రలు గాని, మొక్కజొన్న కర్రలు కాని, తుమ్మచెట్టు కట్టెలు కాని దేనితోనైనా ఈ– బయోచార్ తయారు చేయొచ్చని తెలిపారు. వీటితో సేంద్రియ ఎరువు తయారవుతుందని, ఇది నర్సరీ మొక్కలకు, పత్తి, వరి, మిరప, బత్తాయి, నిమ్మ వంటి ఏ పంటకై నా వేసుకోవచ్చని పేర్కొన్నారు. వేరుకు గాలి తగిలి గాలిలో ఉన్న పోషకాలను కూడా వేరు తీసుకుని మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. వానపాములు, మిత్ర సూక్ష్మజీవులు పెరిగి చీడపీడలు, తెగుళ్లు రాకుండా ఉంటుందని తెలిపారు. దీంతో పంట నాణ్యత, ఉత్పత్తి పెరుగుందని తెలిపారు. కార్యక్రమంలో చుండూరు అనురాధ, గడ్డంపల్లి భిక్షంరెడ్డి, ముత్యంరెడ్డి, చెన్నారెడ్డి, విజయానందరెడ్డి పాల్గొన్నారు.


