యాదగిరిగుట్ట రూరల్ : ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామ స్టేజీ సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ముడుగుల సరళ(45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గురువారం ఉదయం బాహుపేట పరిధిలోని ఓ వెంచర్‌లో పనికి వెళ్లింది. సాయంత్రం వంగపల్లి గ్రామానికే చెందిన ముంజ స్వామి ద్విచక్ర వాహనంపై ఇద్దరూ కలిసి వస్తుండగా.. బాహుపేట స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరళ అక్కడికక్కడే మృతిచెందింది. స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


