ఫ తిప్పర్తి సమీపంలో ఘటన
తిప్పర్తి : గేదెను ఢీకొని రైలు ఆగిపోయింది. ఈ ఘటన తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం రైల్వే గేటు వద్ద గురువారం జరిగింది. స్థానికులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు–సింహద్రి ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు నుంచి వికా రాబా ద్‌కు వెళ్తుండగా.. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం రైల్వే గేటు సమీపంలో గేదెను ఢీకొట్టింది. దీంతో గేదె రైలుకు, పట్టాలకు మధ్యన ఇరుక్కుపోవడంతో 20 నిమిషాల పాటు రైలు ఆగింది. గేదెను పక్కకు తొలగించడంతో రైలు తిరిగి కదిలింది.
ట్రాక్టర్ కింద పడి
బాలుడు మృతి
మిర్యాలగూడ : బాలుడు సైకిల్ తొక్కుతూ ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన దామరచర్ల మండలం వాడపల్లిలో గురువారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి గ్రామానికి చెందిన కిలారి సరిత, బంగారి దంపతుల కుమారుడు కుందన్ సాయి(6)కి మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనిచ్చారు. గురువారం గ్రామంలో కుందన్ సాయి సైకిల్ తొక్కుతుండగా.. నీటిని తీసుకెళ్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుని మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు..
రాజాపేట : తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన రాజా పేట మండలం కుర్రా రం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బూర్గు పోశెట్టి(60) రోజుమాదిరిగానే గురువారం మధ్యాహ్నం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. మోకు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన పోశెట్టిని చుట్టుపక్కల రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోశెట్టికి భార్య అనసూర్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
టాంగా కార్మికుడికి
తీవ్ర గాయాలు
యాదగిరిగుట్ట : గుర్రం ఎదురు తిరగడంతో యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని పాతగుట్టలో టాంగా కార్మికుడికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన టాంగా కార్మికుడు యాదగిరి గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు భక్తులను టాంగాలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అక్కడ భక్తులను దించి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో గుర్రం ఎదురు తిరిగింది. దీంతో యాదగిరి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని యాదగిరికి ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


