ధ్రువపత్రం చెల్లించే ధర (రూ.లలో)
ఆదాయ ధ్రువీకరణ పత్రం 80
కుల ధ్రువీకరణ పత్రం 80
నివాస ధ్రువీకరణ పత్రం 80
ఆహార భద్రత కార్డుకు 80
భూ భారతి ఈ కేవైసీ 80
కొత్త విద్యుత్ కనెక్షన్ 80
క్రీమీ, నాన్ క్రీమీ లేయర్ అప్లికేషన్ 80
ఈసీ 62
ఫార్మర్ రిజిస్ట్రీ 18
కోర్టు కేసు ఈ కేవైసీ 62
బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ 62
ఈ–పాస్ బయోమెట్రిక్ 35
త్రైమాసిక పన్ను 62
లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ 62
భువనగిరి : రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సేవలను అందించే మీ సేవ కేంద్రాల్లో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. అయితే ఈ నెల 1వ తేదీ నుంచే పెంచిన చార్జీలను అమలు చేయాలనుకున్నా.. వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు కాలేదు. దీంతో 36 గంటల పాటు మీ సేవ వెబ్‌సైట్‌ను నిలిపేసి అప్‌డేట్ చేశాక సేవలు కొనసాగిస్తున్నారు. పెంచిన చార్జీల వల్ల రైతులు, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది.
ఏ కేటగిరీకి ఎంత..
మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ సేవలకు(పహాణీ, ఈ కేవైసీ వంటి తక్షణ సేవలు) గతంలో కనీస చార్జీ రూ.35 ఉండగా.. ఇప్పుడు దానిని రూ.62కు పెంచారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే బీ కేటగిరీ సేవల(కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు) చార్జీని రూ.80గా నిర్ణయించారు.
78 శాతం వరకు పెంపు
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సుమారు 62 మీ సేవ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల ద్వారా 350కి పైగా సేవలందిస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఆధాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రతి నెలా సగటున సుమారు 3వేలకు పైగా దరఖాస్తులు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ గణంకాలు తెలియజేస్తున్నాయి. వీటితో పాటు వివిధ రకాల ప్రభుత్వ పథకాల కోసం మీ సేవ కేంద్రాలలోనే దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో మీ సేవల చార్జీలు పెంచడంతో ప్రతి సర్వీస్‌పై 78 శాతం వరకు ప్రజలపై అదనపు భారం పడుతుంది. గతంలో ఒక్కో ధ్రువీకరణ పత్రం పొందడానికి రూ.45 తీసుకోగా ఇప్పుడు ఏకంగా రూ.80 వరకు పెంచారు. కొన్ని మీ సేవ కేంద్రాలలో పెంచిన ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అదనంగా రూ.15 నుంచి రూ. 20లు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చార్జీల పట్టికను ఏర్పాటు చేయాలి
భూములకు సంబంధించిన రికార్డులు, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లడం తప్పనిసరిగా మారింది. పెంచిన ధరలతో సామాన్యులకు భారం తప్పేలా లేదు. అయితే పెరిగిన ధరల పట్టికను మీ సేవ కేంద్రాలలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ ఒక్కో ధ్రువపత్రంపై
78శాతం అదనపు భారం
ఫ ధ్రువీకరణ పత్రం పొందాలంటే రూ.80 చెల్లించాల్సిందే


