పశువుల్లో రేబిస్‌ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

పశువుల్లో రేబిస్‌ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

కుక్కను వెంటనే చంపొద్దు

పెద్దవూర: కుక్కలు మనుషులను, మూగజీవాలను కరవడం వలన రేబిస్‌ వ్యాధి సోకుతుంది. రేబిస్‌ వైరస్‌ ఎక్కువగా పశువుల కేంద్ర నాడీ మండలంపై ప్రభావం చూపడం వలన పశువుల్లో పక్షవాతం, మరణం సంభవిస్తుంది. కుక్క కరిచిన 2–3 వారాల తర్వాత రేబిస్‌ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. రేబిస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మండల పశు వైద్యాధికారి నులక నాగార్జున్‌రెడ్డి వివరించారు.

రేబిస్‌ వ్యాధి ఎక్కువగా కుక్కల ద్వారా సోకుతుంది. అంతేకాకుండా పిల్లులు, ముంగిసలు, నక్కలు తదితర జంతువుల ద్వారా కూడా సోకుతుంది. రాబ్డో వైరస్‌ క్రిముల వలన సంభవించే ఈ వ్యాధి సోకితే మృత్యువు నుంచి బయట పడడం అసాధ్యం. ఊర కుక్కలు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మనుషులు పిచ్చి కుక్క కాటుకు గురై మృత్యువు బారిన పడుతుంటారు. యాంటీ రేబిస్‌ టీకాలను సకాలంలో వేయించడం వలన ఈ వ్యాధిని అరికట్టవచ్చు.

అతిగా స్పందిస్తాయి..

పశువులలో రేబిస్‌ వ్యాధి ఉగ్ర, శాంత రూపంలోకి సోకి పశువులు 7 నుంచి 10 రోజులలో మరణిస్తాయి. రేబిస్‌ వ్యాధి ఉగ్ర రూపంలో సోకితే ప్రవర్తన, నడకలో మార్పు ఉంటుంది. యజమానిని పశువులు గుర్తించవు. చిన్న కదలికలకు, శబ్దాలకు కూడా అతిగా స్పందిస్తాయి. అతి జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. రాళ్లు, రప్పలు, కర్రలను నములుతుంటాయి. వస్తువులపై, ఇతర జంతువులపై దాడి చేస్తుంటాయి. కదిలే వస్తువులను చూసి ఉద్రేకానికి గురవుతాయి. వ్యాధిగ్రస్త పశువులను కట్టివేసిన ప్రదేశంలో చుట్టూ గుండ్రంగా తిరుగుతూ గుద్దుకుంటాయి. గిత్తలలో కామోద్రేకం అధికమవుతుంది. రంకె బిగ్గరగా వేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన ఒకటి, రెండు రోజుల తర్వాత పక్షవాతం సంభివించి మృత్యువాత పడతాయి.

చొంగ ఎక్కువగా కారుస్తాయి..

రేబిస్‌ సోకినప్పుడు పశువులు నడుము వంచి నడిచేటప్పుడు వెనక భాగం ఊగుతూ, తోక ఒక పక్కకు వంచి ఉంటాయి. వ్యాధి సోకినప్పుడు పశువుల నోట్లో నుంచి విపరీతమైన చొంగ కారుతుంది. ముక్కు విరుస్తుంటాయి. గొంతు ప్రాంతంలోని కండరాలకు బిగుసుకుపోయి ఏదో అడ్డుపడినట్లు ఉంటుంది. మేత, నీరు సరిగ్గా తీసుకోవు. తరచూ ఆవలిస్తుంటాయి.

ప్రథమ చికిత్స ఇలా చేయాలి..

పిచ్చి కుక్క కరిచిన వెంటనే గాయాన్ని డెటాల్‌, టింక్చర్‌ అయోడిన్‌ వంటి మందులతో శుభ్రపరచాలి. వెంటనే టిటానస్‌ టాక్సాయిడ్‌ యాంటి బయోటిక్‌ ఇంజెక్షన్‌లు వేయించాలి. గాయానికి 48 గంటలలోపు కుట్టు వేయడం గాని, కట్టుకట్టడం గాని, కాల్చడం గాని చేయరాదు. కుక్కకాటుకు గురైన పశువులను పశువైద్యుల పర్యవేక్షణలో యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్లు వేయించాలి. వీటిలో రెండు రకాల టీకాలు లభ్యమవుతున్నాయి. టిష్యూకల్చర్‌ యాంటీ రేబిస్‌ టీకాలను కుక్క కరిచిన 3, 7, 14, 90వ రోజుల్లో ఆరు ఇంజెక్షన్లు వేయించాలి. ఇక రేబిస్‌ హెచ్‌.ఈ.పీ టీకాలను కుక్క కరిచిన రోజు రెండు ఇంజెక్షన్లు, 3, 5 రోజుల్లో ఒక ఇంజెక్షన్‌ చొప్పున మొత్తం ఐదు ఇంజక్షన్లు ఇవ్వాలి. యాంటీ రేబిస్‌ టీకాలన్నింటినీ 4–10 డిగ్రీల సెంటీగ్రేడ్‌ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. పశువులకు కుక్క కరిచిన వెంటనే టీకాలు వేయడం ప్రారంభించాలి.

పశువును కరిచిన కుక్కను వెంటనే చంపకుండా పది రోజులు దానిని కట్టివేసి పరిశీలించాలి. పది రోజుల్లో కుక్క దానంతటదే మరణిస్తే రేబిస్‌ వ్యాధిగ్రస్తమైనదని భావించాలి. ఒకవేళ కుక్క మరణించకపోతే ఆరోగ్యకరమైన కుక్కగా మాత్రం భావించాలి. పశువుల చొంగతో రేబిస్‌ వైరస్‌ ఐదు రోజుల పాటు జీవించి వ్యాధిని వ్యాపింపజేస్తుంది. కుక్కకాటుకు గురైన పశువులకు నోటి ద్వారా మందులు, ఆహారం తినిపించే సందర్భంలో వైద్యులకు, రైతులకు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన సందర్భాల్లో పశువులకు నోటి ద్వారా ఆహారం, మందులను తినిపించకూడదు.

ఫ పెద్దవూర మండల పశువైద్యాధికారి

నాగార్జున్‌రెడ్డి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement