భువనగిరిటౌన్ : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వలలో సామాన్యులే కాకుండా చదువుకున్న వారు, ప్రముఖులు కూడా చిక్కుకునేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు. తాజాగా భువనగిరి పట్టణంలో మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యాపారులకు టోకరా పెట్టేందుకు ప్రయత్నించారు. వివరాలు.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిని గమనించిన సైబర్ నేరగాళ్లు.. మున్సిపల్ రికార్డుల్లోని లైసెన్స్‌దారుల వివరాలు, వారి ఫోన్ నంబర్లను సేకరించారు. బుధవారం పట్టణంలోని ప్రముఖ వైద్యుడు చావా రాజ్‌కుమార్‌కు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను మున్సిపల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని.. మీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయి ఉందని నమ్మబలికాడు. వెంటనే రూ.9,940 ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాలని స్కానర్ పంపించాడు. లేదంటే లైసెన్స్ రద్దవుతుందని, జరిమానాలు పడతాయని ఒత్తిడి చేశాడు.
డాక్టర్ అప్రమత్తతతో బయటపడ్డ బాగోతం
సాధారణంగా మున్సిపల్ కార్యాలయంలోనే నేరుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించే సదరు డాక్టర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించగా.. తాము ఎవరికీ ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించమని చెప్పమని వారు స్పష్టం చేశారు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని గ్రహించిన డాక్టర్ తనకు ఫోన్ చేసిన నంబర్‌కు కాల్ చేయగా అప్పటికే స్విచ్చాఫ్ చేశారు. ఇదే తరహాలో భువనగిరి పట్టణంలోని మరికొంత మంది వ్యాపారులకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
నమ్మకండి.. మోసపోకండి
ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్న ఘటనపై భువనగిరి ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ కొండల్‌రావు స్పందిస్తూ వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు ఎప్పుడూ ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేయమని కోరరని పేర్కొన్నారు. వ్యాపారస్తులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను కేవలం మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్‌లో లేదా వార్డు ఆఫీసర్లకు నేరుగా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. ఎవరైనా మున్సిపల్ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయంలో లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
ఫ మున్సిపల్ అధికారులమంటూ
వ్యాపారులకు ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు
ఫ ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా
లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఒత్తిడి


