నకిలీ నోట్లు అంటగడుతున్న విదేశీయుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లు అంటగడుతున్న విదేశీయుడి అరెస్టు

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

నల్లగొండ : అమాయకులను నమ్మించి నకిలీ కరెన్సీని అంటగడుతున్న విదేశీయుడిని నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వివరాలు వెల్లడించారు. ఆఫిక్రాలోని మాలి దేశానికి చెందిన సాల్మన్‌ ఉమ డాలియా, గోటియా డౌన్గా రెండేళ్ల క్రితం ఇండియాకు వచ్చారు. కొంతకాలం బెంగళూరులో నివాసం ఉండి వివిధ వ్యాపారాలు చేశారు. వీరితో పాటు మరికొందరు విదేశీయులు కలిసి వాట్సాప్‌ గ్రూపుల్లో పరిచయాలు పెంచుకుని అమాయకులకు నకిలీ కరెన్సీ నోట్లు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని పథకం రచించారు. వీరు అమాయకులకు వాట్సాప్‌ కాల్‌ చేసి.. రూ.లక్ష అసలు కరెన్సీ నోట్లు తమకు ఇస్తే బదులుగా రూ.5లక్షల విలువైన నల్లటి రంగు పూసిన రూ.500 నోట్ల కట్టలు ఇస్తామని నమ్మిస్తారు. ఆ నల్లటి రంగు పూసిన కాగితాలను ప్రత్యేక రసాయనంతో కడిగి నిజమైన నోటుగా మారినట్లు చేసి చూపిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 9న తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్ద ఓ దాబాలో వంగూరి జానయ్య అనే వ్యక్తిని గోటియా డౌన్గా పరిచయం చేసుకున్నాడు. అతడి నుంచి రూ.లక్ష అసలు కరెన్సీ నోట్లు తీసుకుని.. రూ.5లక్షల విలువైన నలుపు రంగు పూసిన రూ.500 నోట్ల కట్టలను, ప్రత్యేక రసాయనాన్ని అంటగట్టాడు. జానయ్య ఇంటికి వెళ్లి గోటియా డౌన్గాలో ఇచ్చిన నోట్ల కట్టలను ప్రత్యేక రసాయనంతో కడిగి చూడగా అవి తెల్ల కాగితాలుగా మారాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన జానయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

స్నేహితుడి కోసం పిలిపించి..

జానయ్య.. తన స్నేహితుడు కూడా రూ.2లక్షలు ఇస్తాడని గోటియా డౌన్గాకు సమాచారం ఇచ్చాడు. దీంతో గోటియా డౌన్గా గురువారం తిప్పర్తి రైల్వే స్టేషన్‌ వద్దకు రాగా జానయ్య, అతడి స్నేహితుడు కలిసి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి అరెస్ట్‌ చేసి అతడి నుంచి సెల్‌ఫోన్‌, రసాయన బాటిల్‌, నలుపు రంగు పూసిన రూ.500 నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తిప్పర్తి ఎస్‌ఐ శంకర్‌ను ఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement