మహిళలే బంకు ఓనర్లు | - | Sakshi
Sakshi News home page

మహిళలే బంకు ఓనర్లు

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

విధుల్లో పూర్తిగా మహిళలే

చౌటుప్పల్‌ : ఇప్పటికే అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు ఇంధన వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. మగువలే యజమానులుగా పెట్రోల్‌ బంకు నిర్వహించనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకులు సైతం మంజూరు చేస్తోంది. నారాయణపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో వనితల ఆధ్వర్యంలో రెండు పెట్రోల్‌ బంకులు విజయవంతంగా నడుస్తుండడంతో ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించాలని సంకల్పించింది. ఈనేపథ్యంలో చౌటుప్పల్‌ మండలానికి ఒక మహిళా పెట్రోల్‌ బంకు కేటాయించింది.

చౌటుప్పల్‌ మండలం

దండుమల్కాపురంలో హైవే వెంట..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 40పెట్రోల్‌ బంకులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లాకు ఒకటి మంజూరుకాగా దానికి చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామానికి కేటాయించారు. దీనికోసం గ్రామంలోని హైదరాబాద్‌–విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి వెంట బొర్రోళ్లగూడెం స్టేజీ ఎదురుగా, వెహికిల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ పక్కన సర్వేనంబర్‌ 486లో 0–20గుంటల భూమిని గుర్తించారు. భూ కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. త్వరలోనే రెవెన్యూ అధికారులు ఆ భూమిని బంకు ఏర్పాటు కోసం అప్పగించనున్నారు. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ బంకు నడవనుంది. నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలు ఆయిల్‌ కార్పొరేషన్లతో ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా వీటిని ప్రారంభించేందుకుగాను అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఒక్క పెట్రోల్‌ బంకు ద్వారా సుమారు 20మంది వరకు మహిళలు వ్యాపార రంగంలోకి రానున్నారు. పురుషులు లేకుండా మహిళలే నడుపుకోనున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని షిఫ్టుల్లోనూ మహిళలే పనిచేస్తారు. ఒక్క బంకు ఏర్పాటుకు ప్రభుత్వం 50లక్షల రూపాయలు రుణం అందించనుంది. పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల ద్వారా ఆయిల్‌ కంపెనీల నుంచి సమకూరే కమీషన్‌ డబ్బులతోనే బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఇప్పటికే నడుస్తున్న బంకులు లాబాల బాటలో ఉండడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బంకులను విస్తరించేందుకు నిర్ణయించి ప్రక్రియను వేగం చేసింది. ఆర్థిక క్రమశిక్షణకు మహిళలు మారుపేరుగా ఉండడంతో బంకుల నిర్వహణలోనూ చక్కగా రాణిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇంధన వ్యాపార రంగంలోకి మగువలు

ఫ దండుమల్కాపురంలో మహిళా పెట్రోల్‌ బంకు మంజూరు

ఫ నిర్వహణ అంతా మహిళా సమాఖ్యదే

ఫ 20గుంటల భూమి గుర్తింపు

ఫ రూ.50లక్షల రుణం ఇవ్వనున్న ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement