భువనగిరిటౌన్ : నేతన్న బీమా, నేతన్న భరోసా, రుణ మాఫీ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి బసవలింగ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరవుతారని వివరించారు.
ప్రత్యేక అవసరాల
పిల్లలకు శ్రద్ధగా బోధించాలి
భువనగిరి: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందిస్తున్న ఉపకరణాలను వినియోగించి శ్రద్ధగా బోధించాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. గురువారం భువనగిరి పట్టణంలోని భవిత కేంద్రంలో నిర్వహించిన మండలాల సహిత విద్యా బోధకుల సమావేశానికి హాజరై మాట్లాడారు. వారంలో రెండు రోజుల పాటు అందించే ఫిజియోథెరపీని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం బోధనోపకరణాలు, వ్యక్తిగత విద్యా ప్రణాళికలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సహాయ సమన్వయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, బోధకులు రవీందర్‌రెడ్డి, సహిత విద్యాబోధకులు పాల్గొన్నారు.
రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
భువనగిరి: ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఆవరణంలో విద్యుత్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టి నిరవధిక సమ్మేకు సీఐటీయూ నాయకులు మద్దుతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డివిజన్ చైర్మన్ ఇంజ మహేష్, కన్వీనర్ బోట్ల రమేష్, కో కన్వీనర్ ఎడ్ల వెంకటేష్, నాయకులు పాండరిరెడ్డి, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
భువనగిరిటౌన్ : జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా, కనీస సౌకర్యాలు లేని చోటుకు కోర్టును తరలిస్తే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టు న్యాయమూర్తులను కలిసి విన్నవించామని, తరలింపు ప్రక్రియ ఆపేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిసంగి విద్యాసాగర్, మేడబోయిన యాదగిరి, శారద, ఉడుతల సురేష్, పడాల శ్రీనివాస్ పటేల్, పత్తిపాటి ప్రసాద్ రావు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం గావించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.


