భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ వంట సామగ్రి, బియ్యం, సరుకులను పరిశీలించి గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠ్యాంశాల పై అవగాహన వచ్చేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. అంతకు ముందు పాఠశాలలోని వంట గది, వంట సామగ్రి, ఆహారం, పరిసరాలను పరిశీలించారు. విద్యా ర్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉన్నారు.
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
సాక్షి, యాదాద్రి : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ – అలైవ్ వారోత్సవాల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ అకాంశ్‌యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రత కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీస్ శాఖ తరపున అరైవ్– అలైవ్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


