వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు కట్టబెడుతున్న కేంద్రం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు కట్టబెడుతున్న కేంద్రం

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

భూదాన్‌పోచంపల్లి: వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన రైతు సంఘం జిల్లా మహాసభల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు మద్దతు ధర రెట్టింపు చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నించగా రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాటి స్థానంలో విత్తన, విద్యుత్‌ సవరణ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఇటీవల మోదీ సర్కార్‌, అమెరికాతో చేసుకొన్న దైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం మన దేశంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలను ఎత్తివేసిందన్నారు. ఒప్పందం వల్ల మనదేశ ఆహారభద్రతకు పెనుప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 13న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌ కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ జహంగీర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమగుడు నర్సింహ, ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షుడు గూడురు అంజిరెడ్డి, మేక అశోక్‌రెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మాటూరి బాలరాజు, డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేశ్‌, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఫ అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement