సాక్షి,యాదాద్రి : ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 1200 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తి అయ్యాయని, జూన్ వరకు 3వేల ఇళ్లు పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం ఆలేరులోని మినీ మీటింగ్ హాల్‌లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గుడిసెలు లేని ఆలేరు నియోజకవర్గాన్ని సాధిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ఆలేరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. వంగపల్లి ప్రాంతంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లకు కరెంట్, రోడ్లు, మంచినీటి సౌకర్యాలు వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీరాములు అధికారులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


