గ్రంథాలయానికి 1,235 పుస్తకాల అందజేత
చిట్యాల: మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కీర్తి పురస్కార గ్రహీత, విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ చేపట్టిన స్టార్ట్ లైబ్రెరీ–సేవ్ లైబ్రెరీ కార్యక్రమానికి ఏపీ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డాక్టర్ రావి శారద బాసటగా నిలిచారు. ఈమేరకు శని వారం వివిధ అంశాలకు చెందిన 1,235 పుస్తకాలను శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నడిగోటి శ్రీనివాస్, ఏపీ గ్రంథాలయ కార్యాలయ మేనేజర్ శివరామకృష్ణ, గ్రంథపాలకురాలు అనిత పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్
పోటీలకు మర్యాల విద్యార్థులు
బొమ్మలరామారం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మర్యాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సన్నీ, భావేష్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మలజ్యోతి శనివారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 11న నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండర్ 20 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపికలో సన్నీ, భావేష్‌లు ప్రథమ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న ఆదిలాబాద్ జిల్లా ఇందిర ప్రియ దర్శిని స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్మల జ్యోతి వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ రోజారాణి, సర్పంచ్ సంగి గణేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
గల్లంతైన వ్యక్తి
మృతదేహం లభ్యం
ఫ వివాహమైన మూడు నెలలకే విషాదం
వైరారూరల్: ఖమ్మం జిల్లాలోని వైరా నదిలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. కోదాడ మండలం అనంతగిరి వాసి షేక్ నాగుల్‌మీరా(32)కు మూడు నెలల క్రితం కల్లూరు మండలం పెద్దకోరుకొండికి చెందిన షేక్ ముంతాజ్‌తో వివాహమైంది. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈనెల 12న ఆయన పెద్దకోరుకొండిలోని అత్తగారింటికి వచ్చాడు. తిరిగి శుక్రవారం స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గన్నవరంలోని వైరా నది లోలెవల్ వంతెనపై ద్విచక్ర వాహనం అదుపు తప్పగా నాగుల్‌మీరా నదిలో పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేసినా నీట మునిగిపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై పి.రామారావు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో శనివారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పిలిపించి గాలిస్తుండగా నాగుల్‌మీరా మృతదేహం లభ్యమైంది. ఆయన తండ్రి షేక్ యాకూబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
గ్రంథాలయానికి 1,235 పుస్తకాల అందజేత


