బేగంపేటలో చిరుత జాడలు!
రాజాపేట : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి సంచారం చేసినట్లు అడుగు జాడలను రైతులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి, బీట్ ఆఫీసర్లు లిఖిత, మల్లేష్, ఆర్‌ఐ నర్సింహులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు నీల బాలకిషన్ వ్యవసాయ భూమిలో పులి అడుగుజాడలను గుర్తించి వాటిని క్షణ్ణంగా పరిశీలించారు. ఇవి చిరుతపులి అడుగు జాడలేనని, బురదలో అడుగు జాడలు కొంచెం పెద్ద సైజు ఉండటంతో పెద్దపులిగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల నుంచి వచ్చి ఉండొచ్చని, రాత్రి ఇక్కడే ఉందా లేదా వెళ్లిపోయిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీరారెడ్డిపల్లి, బేగంపేట, రాజాపేట పరిసర ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యోదయం తరువాత వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగిరావాలని కోరారు. ఒంటరిగా వ్యవసాయ బావులవద్దకు వెళ్లొద్దని, గుంపులుగా చప్పుడు చేస్తూ వెళ్లాలని గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. వ్యవససాయ బావుల వద్ద ఉన్న పశువులను ఇంటికి తరలించాలని సూచించారు. జిల్లా అధికారులకు సమాచారం అందించామని, చిరుతపులి జాడలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. చిరుత వెళ్లిపోయిన సమాచారం అందించేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గంధమల్ల, వీరారెడ్డిపల్లివాసుల భయాందోళన
తుర్కపల్లి: మండలంలో గంధమల్ల, వీరారెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో తుర్కపల్లి మండలంలో భయాందోళన నెలకొంది. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేశం సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లొద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా అధికారులకు సహకరించాలని కోరారు.


