ఏఎస్పీ రాహుల్‌రెడ్డి బదిలీ
భువనగిరి: భువనగిరి ఏఎస్పీ కె .రాహుల్‌రెడ్డి బదిలీ అయ్యారు. మల్కాజ్‌గిరి జోన్ ట్రాఫిక్–1 డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ
భువనగిరిటౌన్ : ఈ నెల 19 నుంచి నూతన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వన్నట్లు కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు మొదటి బ్యాచ్ వలిగొండ, రెండో బ్యాచ్ భూదాన్‌పోచంపల్లి, తుర్కపల్లి మండలాలు, వచ్చేనెల 3నుంచి 7వ తేదీ వరకు మొదటి బ్యాచ్ బొమ్మలరామారం, రెండో బ్యాచ్ అడ్డగూడూరు, ఆలేరు, రామన్నపేట మండలాలకు ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 9నుంచి 13వరకు మొదటి బ్యాచ్ భువనగిరి, రెండో బ్యాచ్ మోత్కూర్, రాజాపేట, యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి బ్యాచ్ బీబీనగర్, రెండో బ్యాచ్ చౌటుప్పల్, నారాయణపూర్, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు మొదటి బ్యాచ్ గుండాల, మోటకొండూర్, ఆత్మకూరు మండలాలకు ఉంటుందని తెలిపారు.
కూరెళ్లకు జీవన సాఫల్య పురస్కారం
రామన్నపేట: పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు దాసోజు ఫౌండేషన్‌వారు జీవన సాఫల్య పురస్కారం ప్రదాన చేశారు. శనివారం వెల్లంకిలోని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంలో పురస్కారంతోపాటు రూ 10,116 నగదును ఆయనకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ దాసోజు పద్మావతి మదనాచారి అందజేసి సన్మానించారు. దాసోజు వజ్రమ్మ, విశ్వనాథచారిల జ్ఞాపకార్థం ఈ పురస్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసోజు గోవర్ధనాచారి, ప్రముఖ న్యాయవాది భాస్కరాచారి, కూరెళ్ల ఫౌండేషన్ అధ్యక్షుడు బోగోజు గోవర్ధనాచారి, కార్యదర్శి కె.నర్మద పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం ఉదయం సుప్రఽభాతం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం,అర్చన పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు.


